అక్కడక్కడ అసమ్మతి స్వరాలు

తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని కొంతమంది నాయకుల అనుచరులు అక్కడక్కడ నిరసన గళం వినిపించారు. కొంతమంది పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

Published : 25 Feb 2024 04:33 IST

ఈనాడు, అమరావతి: తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని కొంతమంది నాయకుల అనుచరులు అక్కడక్కడ నిరసన గళం వినిపించారు. కొంతమంది పార్టీ పదవులకు రాజీనామా చేశారు. నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు తదుపరి కార్యాచరణపై అనుచరులతో భేటీ అయ్యారు. అనకాపల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించటం పట్ల తెదేపా ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం వారంతా ఆయన్ను కలిసి స్వతంత్రంగానైనా పోటీ చేద్దామంటూ కోరారు. జగ్గంపేట నుంచి తెదేపా అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూకు టికెట్‌ ఖరారు చేయటాన్ని నిరసిస్తూ ఆ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి కిర్లంపూడి మండలం గోనాడ నుంచి జగ్గంపేట వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

  • గజపతినగరం తెదేపా టికెట్‌ను కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రకటించటాన్ని నిరసిస్తూ ఆ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి  పదవికి కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేశారు. 
  • డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను ప్రకటించినందుకు నిరసనగా.. పి.గన్నవరం మండల తెదేపా అధ్యక్షుడు తోలేటి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. 
  •  కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుచరులు తెదేపా కార్యాలయం వద్దనున్న ఫ్లెక్సీలు చింపి, నిరసన తెలిపారు.
  • శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి అనుచరులు పెనుగొండలో తెదేపా ఫ్లెక్సీలు తగలబెట్టారు. పార్థసారథికే టికెట్‌ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
  •  శింగనమల అభ్యర్థిగా బండారు శ్రావణి పేరు ప్రకటించటం పట్ల ఆ నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు కేశవరెడ్డి అనుచరులు జిల్లా పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపారు.
  • తంబళ్లపల్లె నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి శంకర్‌యాదవ్‌కు టికెట్‌ రాకపోవటంతో ఆయన అనుచరులు పెదమండ్యం మండలంలో నిరసన తెలిపారు. పార్టీ జెండాలు తగలబెట్టారు.
  • రాయచోటి నియోజకవర్గంలో ఆర్‌.రమేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
  •  కోడుమూరులో ఆకేపోగు ప్రభాకర్‌ అనుచరులు కొందరు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని