తెదేపా-జనసేన తొలి జాబితాలో 18 మంది బీసీలు

తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితాలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. మొత్తం 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా.. వీరిలో బీసీలు 18 మంది.

Published : 25 Feb 2024 04:34 IST

సుదీర్ఘకాలం తర్వాత బ్రాహ్మణులకు టికెట్‌

ఈనాడు, అమరావతి: తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితాలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. మొత్తం 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా.. వీరిలో బీసీలు 18 మంది. ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, గజపతినగరం, విశాఖ పశ్చిమ, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం సిటీ, ఆచంట, నూజివీడు, పెడన, మచిలీపట్నం, రేపల్లె, మైదుకూరు, పత్తికొండ, రాయదుర్గం, పెనుకొండ, అనకాపల్లి స్థానాల్లో బీసీలకు టికెట్లిచ్చారు. వీరిలో తెదేపా అభ్యర్థులు 17 మంది, జనసేన నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుండగా తొలి జాబితాలోనే 20 ఎస్సీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడం విశేషం. ఆ 20 మందీ తెదేపా అభ్యర్థులే. వీరిలో 10 మంది మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ పది మందిలో మహాసేన రాజేష్‌ (పి.గన్నవరం), కొలికపూడి శ్రీనివాస్‌ (తిరువూరు) సామాజిక కార్యకర్తలు. జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. కొన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న విజయ్‌ బోనెల (పార్వతీపురం) అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్నారు. చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్‌  ప్రవాసాంధ్రుడు. స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. వర్ల కుమార్‌ రాజా (పామర్రు) తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు. ఎరిక్షన్‌బాబు (యర్రగొండపాలెం) సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట) వృత్తి రీత్యా వైద్యురాలు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె. దస్తగిరి (కోడుమూరు) వృత్తిరీత్యా న్యాయవాది. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడైన సునీల్‌కుమార్‌కు సీటిచ్చారు. ఆయన దంతవైద్యుడు. థామస్‌ (గంగాధరనెల్లూరు) బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఏడు ఎస్టీ నియోజకవర్గాలకుగాను కురుపాం, సాలూరు, అరకులకు తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించింది.

నలుగురు క్షత్రియులు, ఇద్దరు వైశ్యులకు టికెట్లు

బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన లోకం మాధవికి నెల్లిమర్ల టికెట్‌ దక్కింది. తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థే అయినా.. సుదీర్ఘ కాలం తర్వాత బ్రాహ్మణులకు టికెట్‌ లభించడం విశేషం. వైశ్య సామాజికవర్గం నుంచి శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) జగ్గయ్యపేట, టీజీ భరత్‌ కర్నూలు టికెట్లు దక్కించుకున్నారు. క్షత్రియులకు నాలుగు టికెట్లిచ్చారు. వారిలో ఉండి సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో పాటు, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), అదితి గజపతిరాజు (విజయనగరం), వేగేశ్న నరేంద్రవర్మ (బాపట్ల) ఉన్నారు. వెలమ సామాజికవర్గం నుంచి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబి నాయన), మైనార్టీల నుంచి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల)కు టికెట్లు దక్కాయి. వీరంతా తెదేపా అభ్యర్థులే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని