దోషులు తప్పించుకుంటున్నారు.. అమాయకుల ఇళ్లు కూల్చేస్తున్నారు

ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార భాజపా సర్కారు నిర్వాకం వల్ల దోషులు తప్పించుకుంటుండగా, అమాయక ప్రజల ఇళ్లు మాత్రం కూల్చివేతలకు గురవుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 25 Feb 2024 05:05 IST

భారత్‌ జోడో న్యాయయాత్రలో ప్రియాంక విమర్శ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార భాజపా సర్కారు నిర్వాకం వల్ల దోషులు తప్పించుకుంటుండగా, అమాయక ప్రజల ఇళ్లు మాత్రం కూల్చివేతలకు గురవుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’- రెండ్రోజుల విరామం తర్వాత శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి తిరిగి ప్రారంభమైంది. ప్రియాంక కూడా యాత్రలో పాల్గొన్నారు. ‘యూపీలో తమ జీపులతో రైతుల్ని ఢీకొట్టి చంపించిన నేతల ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లవు. మహిళల్ని వేధించినవారి ఇళ్లమీదకి, ప్రశ్న పత్రాలు లీక్‌ చేసినవారి ఇళ్లపైకీ వెళ్లవు’ అని ప్రియాంక విమర్శించారు. ‘దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయినా, రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నా.. ప్రభుత్వం వాటిపై దృష్టి నిలపడం లేదు. మహిళలు, పిల్లలు, రైతులకు అన్యాయం జరుగుతోంది. అందుకే ఈ యాత్ర పేరులోనే న్యాయాన్ని చేర్చాం. మీరు తలచుకునేవరకు ఈ పరిస్థితుల్లో మార్పు రాదు’ అని ప్రజలనుద్దేశించి ప్రియాంక చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని