జనసేనకు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 శాసనసభ,  మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పారు.

Updated : 25 Feb 2024 12:47 IST

24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ
5 స్థానాలే అధికారికంగా ప్రకటన
అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో బరిలోకి
భీమవరం నుంచే పవన్‌ కల్యాణ్‌
అనకాపల్లి లోక్‌సభ స్థానానికి నాగబాబు
దాదాపు ఖరారు.. ప్రకటనే తరువాయి

ఈనాడు, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 శాసనసభ,  మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పారు. ఇందులో జనసేన పోటీ చేయబోయే 5 శాసనసభ స్థానాలు, అక్కడి అభ్యర్థులను శనివారం ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే అధిక సీట్లు దక్కనున్నాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేయాలని దాదాపు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. తెలుగుదేశతో పొత్తులో భాగంగా మూడు లోక్‌సభ స్థానాలు ఖరారు కాగా.. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. అనకాపల్లి నుంచి కొణిదెల నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ దాదాపు ఖాయం. కాకినాడ నుంచి సానా సతీష్‌తో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండి ఆ పార్టీ కాకినాడ ఎంపీ సీటు ఆశిస్తే జనసేనకు దాని బదులు మరొకటి ఖరారవుతుంది.

శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు తీసుకుంటోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇప్పటికే కాకినాడ గ్రామీణ, రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజోలులో సైతం పోటీ చేస్తారు. వీటికి తోడు రాజమహేంద్రవరం గ్రామీణ, పిఠాపురం స్థానాలనూ ఆ పార్టీ కోరుకుంటోంది. ఇక్కడ తెదేపాకు బలమైన అభ్యర్థులు ఉండటంతో కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఆరు సీట్లు (భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు) జనసేన కోరుతోంది. నాలుగు సీట్ల వరకు జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. నిడదవోలు సీటు దక్కితే ఇతర స్థానాల్లోని బలమైన అభ్యర్థిని ఎవరినైనా అక్కడికి తీసుకొచ్చే ఆలోచనా చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానం జనసేన కావాలంటోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి, యలమంచిలి, విశాఖ దక్షిణ స్థానాల్లో ఏవైనా రెండు జనసేనకు దక్కే ఆస్కారం ఉంది.  ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలతోపాటు ప్రకాశం జిల్లాలో దర్శి కూడా అడుగుతున్నారు. తిరుపతి, చిత్తూరు శాసనసభల్లో ఒకటి,  మదనపల్లి స్థానంపైనా ఆ పార్టీ దృష్టి పెట్టింది. గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాలను జనసేన నేతలు కోరుతున్నారు.

పక్క స్థానాలకు మార్పు

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో జనసేన నుంచి కందుల దుర్గేష్‌ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ తెదేపా సిటింగ్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి కూడా సీటు కావాలంటున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులేనని.. ఇద్దరికీ అవకాశం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇలా రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్నచోట ఒకరికి అక్కడ అవకాశమిచ్చి, మరొకరిని సమీపంలోని మరో స్థానానికి పంపాలని యోచిస్తున్నారు. అయితే ఎవరిని ఉంచాలి, ఎవరిని మార్చాలి, ఎవరికి ఎక్కడ విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే కోణంలో పరిశీలిస్తున్నారు.

5 అంకె ఇష్టం కావడం వల్లే..

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు 5 అంకె ఇష్టమని.. అందువల్లే మరికొన్ని స్థానాలు, అభ్యర్థులపై పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ తొలి జాబితాలో 5 స్థానాలే ప్రకటించారని తెలిసింది. తెనాలి నుంచి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పేర్లు ప్రకటించారు. వీరందరి అభ్యర్థిత్వాలు ముందు నుంచీ ఊహిస్తున్నవే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని