గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం

‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు.

Updated : 25 Feb 2024 06:55 IST

రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా-జనసేన పొత్తు
ఈ కూటమికి భాజపా ఆశీస్సులున్నాయి
ఐదు కోట్ల మంది ప్రజలకు, అవినీతి పార్టీకి మధ్య ఎన్నికలివి
విలేకరుల సమావేశంలో చంద్రబాబు, పవన్‌
తెదేపా 94, జనసేన 5 పేర్లతో తొలి జాబితా విడుదల
24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ

ఈనాడు, అమరావతి: ‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు. ‘తెదేపా - జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని రెండు పార్టీలూ నడుం బిగించాయి. దీన్ని మరింత బలోపేతం చేయడానికి భాజపా ఆశీస్సులూ ఉన్నాయి. మంచి ప్రయత్నానికి ఇది తొలి అడుగు’ అని వివరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో.. తెదేపా, జనసేన తరఫున శాసనసభకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఇద్దరు నేతలు ఉమ్మడిగా శనివారం విడుదల చేశారు. నాగపౌర్ణమి శుభ ముహూర్తంలో తొలి జాబితా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, భాజపా కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘ఐదు కోట్ల ప్రజలకు.. అహంభావి, పెత్తందారీ, ధనబలం కలిగిన పార్టీకి మధ్య జరిగే ఎన్నికలివి. ప్రజలంతా ఆలోచించాలి. తెదేపా- జనసేన అభ్యర్థులకు విజయం చేకూర్చాలి. అందరికీ సీట్లు రాకపోవచ్చు. తెదేపా అభ్యర్థులు పోటీచేసే చోట జనసేన, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నచోట తెదేపా కార్యకర్తలు సహకరించాలి. ఇరు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అది ఓటుబ్యాంకుగా మారుతుంది’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే డబ్బు చేరవేశారు: చంద్రబాబు

తెదేపా- జనసేన కలిసినప్పుడే ఓటమి భయంతో వైకాపా కాడి కింద పడేసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘రౌడీయిజం, దొంగ ఓట్లు, బూత్‌ల ఆక్రమణ, వాలంటీర్ల ద్వారా అధికార దుర్వినియోగానికి ప్రయత్నిస్తోంది. వారి ఆటలు సాగనివ్వం. సమర్థంగా ఎదుర్కొంటాం. ఇప్పటికే బస్తాల కొద్దీ డబ్బును నియోజకవర్గాలకు తరలించారు. ఎర్రచందనం, ఇసుక, మద్యంతో దోచుకున్న అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు. ప్రజాబలం ఉంది. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలే ముందుకొచ్చి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టి గెలిపించుకోవాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఇరు పార్టీల అభ్యర్థులంతా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. వైకాపా అభ్యర్థుల్లో రౌడీలు, గూండాలే కాదు, ఎర్రచందనం స్మగ్లర్లూ ఉన్నారు. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కేసులు వాదించడానికి అడ్వొకేట్లకు రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. భయం కూడా ఉంది. మీడియాపై దాడులు జరుగుతున్నా ప్రతిఘటించలేని పరిస్థితి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైకాపా విధ్వంసం చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నార’ని వాపోయారు.

‘రాష్ట్రం విడిపోయినప్పటి కంటే.. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే ఏపీ ఎక్కువగా నష్టపోయింది. ఐదేళ్ల పాలనలో కోలుకోలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను విధ్వంసం చేశారు. ప్రజావేదికను కూలగొట్టిన తర్వాత ఆ శిథిలాలను తొలగించకపోవడమే అహంభావి పాలనకు ఉదాహరణ’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి ఇరు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘సిటింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జనసేన నేత కందుల దుర్గేశ్‌ ఇద్దరూ సమర్థులైన నాయకులే. వీరికి తప్పకుండా న్యాయంచేస్తాం. ఒకరికి రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి, మరొకరికి ఇంకోచోట అవకాశం కల్పిస్తాం. ఇద్దరితోనూ మాట్లాడుతున్నాం. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో త్వరలోనే స్పష్టత ఇస్తామ’ని వెల్లడించారు.

ఓట్ల బదలాయింపు సాఫీగా జరగాలి: పవన్‌

‘భాజపాతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మా సీట్ల సంఖ్యను కుదించుకున్నాం. పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. తొలి దఫాలో ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నామ’ని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ‘మేం నిర్మాణాత్మకంగా, బాధ్యతగా ఆలోచించాం. ఎక్కువ స్థానాలు తీసుకోవాలని కొందరు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పది స్థానాల్లోనైనా గెలిచి ఉంటే ఈసారి ఎక్కువ స్థానాలు తీసుకునే అవకాశం ఉండేది. ఎక్కువ చోట్ల పోటీపడి ప్రయోగం చేయడం కంటే, తక్కువ స్థానాలతో రాష్ట్రానికి ఉపయోగపడాలని నిర్ణయించాం. 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. 3 లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలనూ పరిగణనలోకి తీసుకుంటే.. 40 చోట్ల పోటీ చేస్తున్నట్లు లెక్క’ అని వివరించారు. ‘వ్యక్తి, పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పార్టీ కోసం కష్టపడ్డవారు, సమర్థులు, అనుభవజ్ఞులకు ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల్లో ప్రాధాన్యమిస్తాం’ అని పవన్‌ హామీ ఇచ్చారు. జనసేన ఓటు తెదేపాకు బదిలీ అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, ఇది సాఫీగా జరిగేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సిద్ధం అంటూ జగన్‌ చావగొడుతున్నారు. మేం కూడా యుద్ధానికి సిద్ధమే. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే  యుద్ధం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని