తెలంగాణ నుంచి రాహుల్‌ పోటీ!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్‌ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

Updated : 27 Feb 2024 06:39 IST

ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో..

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్‌ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్‌గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఖర్గేతో రేవంత్‌ చర్చలు

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నిలవాలని సూచించినా.. సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి ఎగువసభకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ను.. ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. దీనికి ఆయా నేతలతో పాటు రాహుల్‌ అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి అగ్రనేత పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

వయనాడ్‌ బరిలో డి.రాజా సతీమణి

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌లో సీపీఐ పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. ఇంతలోనే ఇక్కడ ఈ కూటమిలోని సీపీఐ.. తన అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. అలానే ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ సైతం మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ మరోసారి వయనాడ్‌ నుంచి పోటీలో ఉండకపోవచ్చని జాతీయ మీడియా కథనాలు సోమవారం వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని