‘శ్రీకాకుళంలో కడప రెడ్ల పెత్తనమేంటి?’

శ్రీకాకుళంలో కడప రెడ్లు అజమాయిషీ చెలాయిస్తే ఊరుకోనంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన కళింగ కోమటి సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.

Updated : 27 Feb 2024 17:12 IST

ఎవరో సుబ్బారెడ్డి వచ్చి భూమి తీసుకుంటానంటే పొమ్మని చెప్పా
ఇలాగే వదిలేస్తే జిల్లా రౌడీల పాలవుతుంది
మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళంలో కడప రెడ్లు అజమాయిషీ చెలాయిస్తే ఊరుకోనంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన కళింగ కోమటి సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఆ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో నేను నిజాయతీపరుడిగా ఉన్నాను. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడకూడదు. ప్రజాప్రతినిధిగా జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి ఈ భూమి తీసుకుంటాం.. ఏదేదో చేసేస్తాం అని అన్నాడు. నిన్ను ఎవడు ఇక్కడికి రమ్మన్నాడు. శ్రీకాకుళం నీ అబ్బగాడి సొత్తు అనుకున్నావా.. తంతాను పొమ్మని చెప్పా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అజమాయిషీ చెలాయించవచ్చని అతను అనుకుంటున్నాడు. దాన్ని నేను అవమానంగా భావిస్తా. మన జిల్లాలో ఇతర జిల్లాల వారి పెత్తనమేంటి? వారు మన పార్టీనా.. పక్క పార్టీనా అని కూడా చూడను. సుబ్బారెడ్డి చెప్పిన దానికి నేను సరే అని వదిలేస్తే జిల్లా రౌడీల పాలవుతుంది. రౌడీల వద్దకు ఎవరో వెళ్లరు. మనకు చెందిన వారే.. ఒకడ్ని మరొకడు దోచుకోవడానికి రౌడీలను ఆశ్రయిస్తారు. వాళ్ల కంటే పెద్ద రౌడీ ఇంకెవడో ఉంటాడు.. ఆ పెద్ద రౌడీకి అసలు బాసు ఒకడు ఉంటాడు. ఈ వ్యవస్థ అలా రౌడీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. బాధ్యత లేకుండా వచ్చేవారు ఆ వేళ పైసో పరకో కోసం ఏదో పని చేస్తే అది తప్పుడు దారిలోకి వెళ్లిపోతుందని ఆలోచించాలి’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు