ఒక్క ఎంపీ సీటైనా గెల్చుకోండి

‘‘ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించి ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కాదని కేటీఆర్‌ అంటున్నారు. చేతనైతే... రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిచి చూపండి’’ అని కేసీఆర్‌, కేటీఆర్‌లకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Updated : 28 Feb 2024 07:06 IST

కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఇదే నా సవాల్‌
మూడు నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్పా ప్రభుత్వం కాదు
చేవెళ్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మహాలక్ష్ములను కోటీశ్వరులను చేస్తామని వెల్లడి

ఈనాడు-హైదరాబాద్‌, చేవెళ్ల-న్యూస్‌టుడే: ‘‘ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించి ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కాదని కేటీఆర్‌ అంటున్నారు. చేతనైతే... రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిచి చూపండి’’ అని కేసీఆర్‌, కేటీఆర్‌లకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సీఎం పదవి అంటే ఇనామ్‌ కాదన్నారు. కార్యకర్తగా కష్టపడ్డానని, మీరు(భారాస ప్రభుత్వం) పెట్టిన బాధలకు, చిత్రహింసలకు ఎదురొడ్డి నిలబడ్డానని.. చర్లపల్లి జైల్లో మానసికంగా ఎంతో వేదన చెందానని తెలిపారు. కేటీఆర్‌లా తండ్రి ఇస్తే తనకు పదవి రాలేదన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో మంగళవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనజాతర’ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘తమకు సోషల్‌ మీడియా లేకపోవడంతో ఓడిపోయామంటూ కేటీఆర్‌ అంటున్నారు. యూట్యూబ్‌ ఛానళ్లు పెట్టుకుంటామంటున్నారు. వందల ట్యూబులు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. భవిష్యత్తులో మా కార్యకర్తలు, ప్రజలు కలిసి వారి ట్యూబులు పగలగొడతారు. మాకూ ఏ పత్రిక, ఛానల్‌ లేదు. సరైన ప్రచారం రాలేదు.

సంపదనంతా కేసీఆర్‌ దోచుకున్నారు..

తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌ సంపదనంతా దోచుకున్నారు. అందుకే ప్రజలు ఓట్ల ద్వారా కేసీఆర్‌ను అధికారం నుంచి దించేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని, ఆరు నెలల్లో పడిపోతుందని.. వెంటనే అధికారంలోకి వస్తున్నామంటూ భారాస నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు, ఆరు నెలల్లో కూలిపోయేందుకు ఇది అల్లాటప్పా ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వాన్ని కనీసం ముట్టుకునేందుకైనా సాహసం చేయాలి.రాష్ట్రంలో మహాలక్ష్ములందరినీ కోటీశ్వరులుగా చేస్తాం. నిజమైన అభివృద్ధిని చూపిస్తాం. అభయహస్తం హామీల్లో భాగంగా మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నాం. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే వారికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నుంచే రెండు కార్యక్రమాలను అమలు చేశాం. ఇంకా దరఖాస్తు చేయనివారు ఉంటే తహసీల్దార్‌, ఎంపీపీ కార్యాలయాలకు వెళ్లి రేషన్‌కార్డు చూపించి ‘మా రేవంతన్న చెప్పారు.. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వండ’ని అడగండి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించిన వెంటనే మహిళా సాధికారతపై దృష్టి సారించాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అతివలకు అండగా ఉండేందుకే ‘గృహజ్యోతి’, ‘మహాలక్ష్మి’ పథకాలను ప్రారంభించాం. గృహజ్యోతి కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది    అర్హులున్నట్లు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం  పావలా వడ్డీ, వడ్డీలేని  రుణాలిస్తామంటూ  మహిళా సంఘాలను మోసం చేసింది. మహిళా సంఘాలకు మేం వడ్డీలేని రుణాలిస్తాం.

అర్హులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలు

కాంగ్రెస్‌ అధికారంలో లేనప్పుడు పదేళ్లు కష్టపడి, పార్టీ నాయకులను గుండెలపై పెట్టుకుని, భుజాలపై మోసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. అర్హులైన ప్రతి కార్యకర్తకు పదవులు ఇస్తాం. సంక్షేమ కార్యక్రమాలకు అర్హులను గుర్తించేందుకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నాం. వీటిలో సభ్యులుగా కార్యకర్తలను నియమించనున్నాం. కష్టకాలంలో అండగా నిలబడిన కార్యకర్తలను సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ ఛైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మంత్రులు, నాయకులది. వేల మంది కార్యకర్త్తలు తమ ఊపిరి ఆగిపోయినా... జెండాను వదల్లేదు. వారు అండగా నిలబడినందునే కేసీఆర్‌ను గద్దె దించాం.

కాంగ్రెస్‌ పథకాలపై దుష్ప్రచారం చేస్తే అడ్డుకోండి

కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న పథకాలపై కొంతమంది భారాస నాయకులు గ్రామాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకోవాలి. పథకాలపై విమర్శలు చేస్తున్నవారు ఏ స్థాయివారైనా ఉపేక్షించవద్దు. వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుండగా... భారాస, భాజపా నేతలు అబద్ధాలు చెబుతున్నారు.

గుజరాత్‌ మోడల్‌ అంటే బెదిరించడం, ప్రభుత్వాలను కూల్చడమా?

గుజరాత్‌ తరహాలో ఇతర రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నామంటూ భాజపా నాయకులు గొప్పలు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి పెట్టుబడులు పెట్టించుకోవడం.. రాజకీయ స్వార్థం, అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం గుజరాత్‌ మోడలా? ప్రధాని మోదీ నిజంగా వాగ్దానాలను నిలబెట్టుకుని ఉంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాల చొప్పున ఇప్పటికే 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చేవి. రైతుల ఆదాయం రెట్టింపయ్యేది. యువతకు ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. మరో నాలుగైదు రోజుల్లో 6 వేల మందికి ఇవ్వనున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మక్కన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, పార్టీ నేతలు వి.హనుమంతరావు, మహేశ్‌కుమార్‌గౌడ్‌, జీవన్‌రెడ్డి, యాదవరెడ్డి, కొండ్రు పుష్పలీల, తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్లు అనితారెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ కుటుంబానికి ఇంటిపెద్ద మోదీ

కేసీఆర్‌ ఏరోజూ నిరుద్యోగులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు. తన కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. కుమార్తె నిజామాబాద్‌లో ఓడిపోతే ఆరు నెలల్లో ఉద్యోగం ఇప్పించారు. వినోద్‌కుమార్‌ కరీంనగర్‌లో ఓడిపోతే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని చేశారు. సంతోష్‌కుమార్‌ను ఎంపీ చేశారు. కేటీఆర్‌కు పదవి కావాలంటూ.. దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అనుమతి కోరారు. అంటే.. కేసీఆర్‌ కుటుంబానికి ఇంటిపెద్ద మోదీ కాదా? వారిద్దరూ దోస్తులే. రాత్రి మాట్లాడుకుంటారు.. ఉదయం లేవగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు.

సీఎం రేవంత్‌రెడ్డి


ఇబ్బందులున్నా హామీలు నెరవేరుస్తాం: భట్టి విక్రమార్క

చేవెళ్ల, న్యూస్‌టుడే: ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల హామీలను నెరవేర్చుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనజాతర బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా చేశారని, కృష్ణా నుంచి నీళ్లిస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు. భాజపా నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని.. తెలంగాణలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యమని గుర్తుంచుకోవాలని భట్టి అన్నారు.


భాజపా నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి: మంత్రి శ్రీధర్‌బాబు

భాజపా నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై భాజపా ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడిన తీరు గర్హనీయమన్నారు. తాము తలుచుకుంటే ఆ పార్టీకి తెలంగాణలో అతీగతీ ఉండదని అన్నారు. భారాస నాయకులు తమ పాలనలో చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తే దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు.


దోచుకున్న పార్టీని ప్రజలు బొంద పెట్టారు: ఉత్తమ్‌

రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీని తెలంగాణ ప్రజలు బొంద పెట్టారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ బుధవారం నుంచి రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.


80 రోజుల్లో 18 కోట్ల జీరో టికెట్లు: మంత్రి సీతక్క

తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో 80 రోజుల్లో 18 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళల సంక్షేమం కోసమే గ్యారంటీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.


భారాసకు మాట్లాడే హక్కు లేదు: పొన్నం

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పదేళ్లలో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని భారాస నాయకులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.


ప్రజలు మార్పు కోరుకున్నారు: పొంగులేటి

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు పథకాలు అమలు చేశామని, మరో రెండు పథకాల అమలుకు శ్రీకారం చుట్టామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని