ప్రభుత్వం అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదు

ప్రభుత్వం అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదని.. ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరాదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated : 28 Feb 2024 06:31 IST

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదని.. ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరాదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులోనూ లాభం తీయాలనుకునే వారు వ్యాపారులవుతారే తప్ప పాలకులు కారన్నారు. మిషన్‌ భగీరథలో లాభం వెతికేవారు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హరీశ్‌రావు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని తెచ్చింది. ‘ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి మిషన్‌ భగీరథ దండగ’ అని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం శోచనీయం. రాష్ట్రం మొత్తం నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రజారోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలే తప్ప లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ఒక ప్రభుత్వాధినేతకు తగదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదని విమర్శిస్తున్నారు.

కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని మొత్తుకుంటున్నా వీళ్లకు వినిపించదు. ఎస్సారెస్పీ ద్వారా అటు కోదాడ వరకు, ఇటు డోర్నకల్‌ వరకు నీరందించగలిగామంటే.. అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులతోనేనని వీరికి అర్థం కాదు. బీడు భూముల్లో సిరులు పండుతుంటే.. రైతుల సంతోషం చూడాలి తప్ప రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మనస్తత్వంతో లాభనష్టాలు చూడొద్దని కోరుతున్నాను. సీఎం రేవంత్‌ ప్రతిసారి నా ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారు. నేనూ మీ ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారంగా ఉండదు. ఎవరెత్తు గురించి ప్రజలకు అవసరం లేదు. వారి కోసం ఎవరెంత ఆలోచిస్తున్నారు.. ఎవరెంత పనిచేస్తున్నారనేది మాత్రమే వారికి అవసరం’’ అని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని