ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా!

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, హిందుత్వం, ధర్మం, పార్టీ గురించి మాట్లాడనని.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోతే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ చేశారు.

Published : 28 Feb 2024 03:50 IST

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవకుంటే మీరు రాజీనామా చేస్తారా?
మంత్రి పొన్నంకు సంజయ్‌ సవాల్‌

ఈనాడు, కరీంనగర్‌-హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, హిందుత్వం, ధర్మం, పార్టీ గురించి మాట్లాడనని.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోతే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుంటే తమపై రాళ్ల దాడి చేస్తున్నారన్నారు. యాత్ర హుస్నాబాద్‌ రాకుండా అడ్డుకోవాలని సిద్దిపేట పోలీసులను ఆదేశించారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని పొన్నం వ్యతిరేకించారని.. శాంతిభద్రతల సమస్యతో రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించి మరొకరికి అవకాశం ఇచ్చేందుకు కావచ్చనే అనుమానం వస్తోందన్నారు. ముందు రేషన్‌కార్డులు ఇచ్చిన తర్వాతే పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పదేళ్లలో రూ.5లక్షల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్‌ రెండు నెలల్లో రూ.10వేల కోట్లు అప్పు చేసిందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతుభరోసా, మహిళలకు నెలకు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తల్లి అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని.. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమలతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంజయ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు

పొన్నం ప్రభాకర్‌, ఆయన తల్లిపై సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సోమవారం రాత్రి హుస్నాబాద్‌ నియోజకవర్గం చిగురుమామిడిలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బొమ్మనపల్లి నుంచి ప్రారంభమైన సంజయ్‌ పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. భాజపా, కాంగ్రెస్‌ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలను సముదాయించిన పోలీసులు యాత్ర కొనసాగింపునకు పటిష్ఠ భద్రత కల్పించారు. కాంగ్రెస్‌ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్‌ మండలం రాములపల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు దిష్టిబొమ్మతో యాత్రలోకి దూసుకువచ్చి అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట, ఘర్షణ జరిగాయి. యాత్ర జరుగుతుండగా కొందరు యువకులు ఇళ్ల వెనుక నుంచి తమపై రాళ్లు విసిరినట్లు భాజపా నాయకులు తెలిపారు. మరోవైపు ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోందంటూ భాజపా శ్రేణులు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని