పాతబస్తీ అభివృద్ధికి మజ్లిస్‌ ఆటంకం

కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు కొలువుదీరడం ఖాయమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని కార్వాన్‌, నాంపల్లి, గోషామహల్‌ నియోజకవర్గాల్లో మంగళవారం భాజపా విజయసంకల్పయాత్ర నిర్వహించారు.

Published : 28 Feb 2024 03:50 IST

విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఆసిఫ్‌నగర్‌, కార్వాన్‌, జియాగూడ, బేగంబజార్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు కొలువుదీరడం ఖాయమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని కార్వాన్‌, నాంపల్లి, గోషామహల్‌ నియోజకవర్గాల్లో మంగళవారం భాజపా విజయసంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘గ్రామాల్లో ప్రజలు భాజపాను ఆదరిస్తున్నారని, మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశం బలహీనంగా ఉండాలని కోరుకుంటున్నాయని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో అవినీతిరహిత పాలన, శాంతిభద్రతలు, పెట్టుబడులు కావాలంటే మోదీని ఆశీర్వదించాలన్నారు. కేసీఆర్‌ 10 ఏళ్లు అధికారంలో ఉండి తన కుటుంబానికే న్యాయం చేసుకున్నారని, కాంగ్రెస్‌ రాహుల్‌, సోనియాలకు సేవ చేసేందుకు సరిపోతుందని విమర్శించారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. పాతబస్తీలో మెట్రోరైల్‌ వస్తే అక్కడ మౌలిక వసతులు ఏర్పడి, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి జరిగితే తమ ఆటలు సాగవని మజ్లిస్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును అడ్డుకుంటోందని విమర్శించారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ రూ.వేల కోట్లు వెనకేసుకుంటే... ముస్లింలు మాత్రం పేదరికాన్ని అనుభవిస్తున్నారని ఆరోపించారు. యాత్రలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కార్వాన్‌ ఇన్‌ఛార్జి అమర్‌సింగ్‌, జీహెచ్‌ఎంసీ భాజపా పక్షనేత గొంటి శంకర్‌యాదవ్‌, కార్పొరేటర్లు లాల్‌సింగ్‌, రాకేశ్‌ జైస్వాల్‌, శశికళ, సురేఖ, భాజపా గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండు యాదవ్‌, ప్రధాన కార్యదర్శి జి.రఘునందన్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అందుబాటులో ఉండీ కార్యక్రమానికి హాజరు కాకపోవడం  చర్చనీయాంశమైంది.


ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుతున్నారు...
కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా 400కు పైగా స్థానాలు సొంతంగా గెలుస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే అన్నారు. విజయసంకల్ప యాత్రలో పాల్గొనేందుకు మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  దేశంలో సంకీర్ణ పాలనకు కాలం చెల్లిందని... ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని, దేశాభివృద్ధిని కాంక్షిస్తున్నారని అన్నారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని