రోజుకు రూ.300 కోట్ల అప్పు

జగన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క ఆర్‌బీఐ నుంచే రోజుకు రూ.257 కోట్లు అప్పు తీసుకుంటోందని, వీటికి కార్పొరేషన్‌ రుణాలు కలిపితే రోజువారీ అప్పు రూ.300 కోట్ల పైమాటేనని  తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 28 Feb 2024 06:32 IST

జగన్‌ ప్రభుత్వంపై నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క ఆర్‌బీఐ నుంచే రోజుకు రూ.257 కోట్లు అప్పు తీసుకుంటోందని, వీటికి కార్పొరేషన్‌ రుణాలు కలిపితే రోజువారీ అప్పు రూ.300 కోట్ల పైమాటేనని  తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ తెలిపారు. అప్పుల్లో రోజుకు రూ.85 కోట్లు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తోందన్నారు. మంగళగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్‌-డిసెంబర్‌)గాను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పరిమితి రూ.30,275 కోట్లు కాగా, జగన్‌ ప్రభుత్వం రూ.69,736 కోట్లు చేసిందని పేర్కొన్నారు. ఇంత పెద్దమొత్తంలో అప్పులు చేస్తూ కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటడం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, దువ్వూరి కృష్ణ తదితరులు జంకూబొంకూ లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1,88,324 కోట్లు.. అంటే నెలకు రూ.20,924 కోట్లు కాగా రోజుకు రూ.698 కోట్లు. దీంట్లో ప్రభుత్వం సొంతంగా సంపాదించింది రూ.264 కోట్లు మాత్రమే. మిగతా రూ.434 కోట్లలో రూ.257 కోట్లు అప్పుల ద్వారా సేకరించిందే’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల అదనపు అప్పు కోసం రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టడానికి వైకాపా ప్రభుత్వం అంగీకరించిందని మండిపడ్డారు. కాగ్‌ నివేదిక ప్రకారం వైకాపా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు వరకు చేసిన అప్పు రూ.69,736.83 కోట్లు నిజమో, కాదో తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని