మాచర్ల ఎమ్మెల్యే బంటుల్లా అధికారులు, పోలీసులు

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి చెప్పినట్టు చేస్తూ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం, పోలీసులు అధికారపార్టీ బంటుల్లా పనిచేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Published : 28 Feb 2024 04:27 IST

గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల్ని నామినేషన్‌ కూడా వేయనివ్వలేదు
సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ల వివరాలతో ఎస్‌ఈసీకి అచ్చెన్నాయుడి లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి చెప్పినట్టు చేస్తూ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం, పోలీసులు అధికారపార్టీ బంటుల్లా పనిచేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వారి ఒత్తిడితో ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల్ని భయాందోళనలకు గురిచేశారని గుర్తుచేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని నామినేషన్‌ కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘‘గత ఎన్నికల్లో వెల్దుర్తి, రెంటచింతల, కారంపూడి, మాచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో బూత్‌లను స్వాధీనం చేసుకొన్న వైకాపా గూండాలు రిగ్గింగుకు పాల్పడ్డారు. తెదేపా బీసీ నాయకులు చంద్రయ్య, జల్లయ్య తదితరుల్ని హత్య చేశారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోండి. సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌ల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేయండి’’ అని అచ్చెన్నాయుడు కోరారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు,  గ్రామాల వివరాల్ని లేఖలో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని