పోలీసుల దౌర్జన్యాలను అడ్డుకోవాలి

రాష్ట్రంలో కార్యకర్తలు, నేతలపై పోలీసుల దౌర్జన్యాలను అడ్డుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను భాజపా నేతలు కోరారు.

Published : 28 Feb 2024 04:37 IST

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు భాజపా నేతల అభ్యర్థన
కేంద్ర పథకాలకు రాష్ట్రప్రభుత్వ స్టిక్కర్లపై ఫిర్యాదులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కార్యకర్తలు, నేతలపై పోలీసుల దౌర్జన్యాలను అడ్డుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను భాజపా నేతలు కోరారు. విజయవాడలో మంగళవారం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకుంటోందని, మొత్తం నిధులను వారే ఇస్తున్నట్లు చెబుతున్నారని భాజపా నేతలు రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు. భాజపా నేతలు, కార్యకర్తలపై పోలీసు దౌర్జన్యాలు పెరిగాయని, డీజీపీతో మాట్లాడాలని ఒకరు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రరాజధానిపైనా ప్రశ్నలు వస్తున్నాయని తెలిపారు. చివరిగా రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ కేంద్ర ఆర్థికసాయం గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి గురించి జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయని, దాన్నే ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రానున్న అయిదేళ్లలో ఏపీలోనూ భాజపా అధికారంలోకి రావడం ఖాయమని తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద కేంద్రం ఆర్థికసాయం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయకపోవడంపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, కేంద్రప్రభుత్వ లోగోను ఇటీవలే ఆరోగ్యశ్రీ కార్డులపై ముద్రిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన వైకాపా ప్రభుత్వం

ఈనాడు, ఏలూరు: వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. ఏలూరులో మంగళవారం గోదావరి జోనల్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘పోలవరం నిర్మాణానికి భాజపా సర్కారు రూ.50వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలోని చేతకాని ప్రభుత్వాలతో పనులు ముందుకెళ్లడం లేదు. పీవీ నరసింహారావుకు భాజపా ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు.


రాజ్‌నాథ్‌ నన్ను ఆశీర్వదించారు

- ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

‘రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశాను. ఆయన నన్ను వీపు తట్టి ఆశీర్వదించారు’ అని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన భాజపా అగ్రనేతల భేటీకి రామచంద్రారెడ్డి హాజరై.. పురందేశ్వరి, రాజ్‌నాథ్‌లతో సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ‘నా రాజకీయ భవిష్యత్తుపై ఇంతవరకు నిర్ణయమేదీ తీసుకోలేదు. ఇకపైనా రాజకీయాల్లోనే ఉంటాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని