వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ ఖరారైనట్టే

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్టే. మార్చాల్సినవన్నీ 99 శాతం మార్చేశా.

Published : 28 Feb 2024 04:40 IST

గెలుపు బాధ్యత ఇక మీదే
పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్‌ దిశానిర్దేశం
అప్పట్లో చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ అందరూ కలిసి మోసం చేశారని వ్యాఖ్య

ఈనాడు, ఈనాడు, డిజిటల్‌ అమరావతి: ‘వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్టే. మార్చాల్సినవన్నీ 99 శాతం మార్చేశా. ఇక ఒకటో అరో ఉంటాయి. అంతకంటే ఎక్కువేమీ లేవు..’ అని ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘అప్పట్లో చంద్రబాబుకు తోడు దత్తపుత్రుడు, కేంద్రంలో మోదీ గాలి వీస్తోంది. ఆయన కూడా వీరితో భాగస్వామి అయి అందరూ కలిసి ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక వారి మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. మోసం ఎప్పుడూ నిలవదు. ఎన్నికల ముందు నేను చేయగలిగిందే చెప్పా..’ అని వివరించారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మంగళగిరి వేదికగా ‘మేం సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ కార్యక్రమాన్ని జగన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు, పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి చేసిన మంచిని వివరించాలని సూచించారు.

నిర్వహణ సామర్థ్యంతోనే విజయం

‘నేను చేయగలిగినదంతా చేశా. మీ చేతుల్లోకి ఏ రాజకీయ పార్టీ, నాయకుడు ఇవ్వని ఆయుధాన్ని ఇచ్చా. దీన్ని ముందుకు తీసుకెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 45 రోజుల్లో మీ నిర్వహణ సామర్థ్యంపై గెలుపు ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదలాలి. ఈసారి 175 ఎమ్మెల్యే స్థానాలకు 175... 25 ఎంపీలకు 25 గెలవాల్సిందే’.

ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం..

‘గతంలో పింఛను అరకొరగా అందేది. మనం దాన్ని రూ.3 వేలు చేశాం. ఒక్క కుప్పం నియోజకవర్గానికే ఈ 57 నెలల్లో నవరత్నాల ద్వారా రూ.1,400 కోట్లను బటన్‌ నొక్కి మహిళల ఖాతాల్లో జమ చేశాం. పథకాల కింద ఇన్ని వేల కోట్లు ఇచ్చామని ఏ నాయకుడైనా చెబితే.. అటువైపు ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. ఇది వాస్తవం. పథకాల సమాచారం గ్రామసచివాలయ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందుబాటులో ఉంది. 57 నెలల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చాం. ఊహకూ అందని విప్లవాత్మక మార్పులు చేశాం. వందల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనని ప్రతి ఇంటికి చూపించాం’ అని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలోనూ మెజారిటీ ఎందుకు రాకూడదు?

‘ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల్లో 87-93 శాతం కుటుంబాలకు మేలు చేశాం. నగరాలు, పట్టణాల్లో 80 శాతం కుటుంబాలకు మంచి జరిగింది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని నియోజకవర్గాల్లో ఇది ప్రస్ఫుటమవుతుంది. ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో ఎందుకు మెజారిటీ రాకూడదు? అది కుప్పమైనా, ఇచ్ఛాపురమైనా సరే..’ అని జగన్‌ పేర్కొన్నారు.

 జగన్‌ బహిరంగ సభల మాదిరిగానే సమావేశానికి వచ్చిన పార్టీ నాయకులు పలువురు సీఎం ప్రసంగం ముగియకముందే వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని