ఎత్తర ‘జెండా’... గెలుపు ఎజెండా

తెలుగుదేశం, జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి.

Updated : 28 Feb 2024 07:05 IST

ఎన్నికల యుద్ధానికి తెదేపా - జనసేన సిద్ధం
తాడేపల్లిగూడెంలో నేడు ఉమ్మడి బహిరంగ సభ
26 ఎకరాల్లో ఏర్పాట్లు.. లక్షల్లో రానున్న కార్యకర్తలు, అభిమానులు
కలిసి కదనరంగంలోకి దూకేలా ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం, జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు చాలా ముందుగా ఏకంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంటున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి ప్రచార బరిలోకి దిగుతున్నారు. రెండు పార్టీల క్యాడర్‌ను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సభలో ఉమ్మడి ‘జెండా’ ఎత్తబోతున్నారు. అందుకే ఈ సభకు ‘జెండా’ అనే పేరును నిర్ణయించారు. ఉత్తరాంధ్ర వేదికగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం ముగింపు సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సైతం పాల్గొన్నారు. అయినా తొలి ఉమ్మడి సభగా తాడేపల్లిగూడెం ‘జెండా’ సభనే పేర్కొంటున్నారు.

పొత్తు అవసరాన్ని వివరించి కార్యోన్ముఖులను చేయడానికే..

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు, సీట్ల సంఖ్య ఖరారైన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. అందుకే జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలుగా, రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే బాధ్యతాయుత నాయకులుగా పొత్తుతో ఎందుకు ముందుకెళుతున్నామో అటు తెదేపా, ఇటు జనసేన శ్రేణులకు ఈ సభలో స్పష్టంగా వివరించబోతున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య పొరపొచ్చాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గళమెత్తబోతున్నారు. కార్యకర్తలు ఎంత బాధ్యతాయుతంగా కలిసి కదనరంగంలోకి దూకాలో దిశానిర్దేశం చేయబోతున్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యసాధనలో పొత్తు ఎంత ప్రధానమో పవన్‌ కల్యాణ్‌ చెప్పబోతున్నారు. అధినేతల ప్రసంగాల్లో ‘ఓటు బదిలీ’ కీలకాంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోనూ రెండు పార్టీల క్యాడర్‌కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోనూ అవకాశాలు లభించబోతున్నాయనీ స్పష్టం చేయనున్నారు. తెదేపా, జనసేన ప్రభుత్వంలోనూ సంక్షేమ పథకాలు ఉంటాయని, ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులనూ పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు సంయుక్తంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో తెదేపా ప్రకటించిన పథకాలతో పాటు జనసేన షణ్ముఖ వ్యూహంలోని సంక్షేమ పథకాలను కలిపి ప్రజలకు వివరించబోతున్నారు. తెదేపా - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను మరింత స్పష్టంగా తెలియజేయబోతున్నారు. 

విస్తృతంగా ఏర్పాట్లు

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు, సమీపంలోని కృష్ణా జిల్లాకు ఎంతో అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఈ భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. తాడేపల్లిగూడెం బైపాస్‌ రోడ్డులో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని అనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో సభకు సర్వం సిద్ధం చేశారు. వేదికపైనే దాదాపు 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరయినా ప్రశాంతంగా సభను తిలకించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతోంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలిరానున్నారు. వందల మంది పోలీసులు మంగళవారమే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై అక్కడే సమావేశమయ్యారు. సభాప్రాంగణమంతా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి చూసి వెళుతుండటంతో సభావేదిక వద్ద మంగళవారమే పెద్ద ఎత్తున కోలాహలం ఏర్పడింది.


సభకు రావాలంటూ చంద్రబాబు ప్రచారం

‘జెండా’ సభకు హాజరుకావాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ విధానంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఏర్పాట్లు పరిశీలించిన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల సభలు జరగకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వైకాపా సభలకు ఎన్ని బస్సులైనా పంపిస్తున్న ఆర్టీసీ.. తెదేపా-జనసేన ఉమ్మడి సభకు మాత్రం ఒక్కటీ కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని