అసెంబ్లీ సెగ్మెంట్‌కో సమన్వయకర్త

లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సమన్వయకర్తలుగా పార్టీ సీనియర్‌ నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది.

Published : 29 Feb 2024 02:57 IST

సీనియర్‌ నేతలకు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు
లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు
ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో సీఈసీకి అభ్యర్థుల జాబితా
మార్చి మొదటి వారంలో అభ్యర్థుల ఎంపిక!
ఈనాడు - హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సమన్వయకర్తలుగా పార్టీ సీనియర్‌ నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలను సమన్వయకర్తలుగా నియమించాలని నిర్ణయించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ బుధవారం ముఖ్య నేతలతో పార్లమెంటు ఎన్నికలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాష్ట్రస్థాయిలో దాదాపు ముగిసింది. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) తాజాగా పంపింది. మార్చి మొదటి వారంలో దిల్లీలో జరిగే సీఈసీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను నిర్ణయిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. మహబూబ్‌నగర్‌కు వంశీచంద్‌రెడ్డిని అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 16 నియోజకవర్గాలకు అభ్యర్థులపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. కొన్ని స్థానాలకు ఒకటి లేదా రెండు పేర్లనే ఎంపిక చేశారు. పోటీ అధికంగా ఉన్న నియోజకవర్గాలపైనే సీఈసీలో చర్చ ఉంటుందని నేతలు చెబుతున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆయన అంగీకరిస్తే ఖమ్మం లేదా భువనగిరి కేటాయిస్తారు. టికెట్‌ ఆశించే నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో.. వారిలో కొందరికి ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర పదవులు అప్పగించి బుజ్జగించనున్నారు. ఇప్పటికే ఖమ్మం, సికింద్రాబాద్‌, వరంగల్‌ వంటి లోక్‌సభ నియోజకవర్గాల టికెట్లు ఆశించిన ముగ్గురు నేతలకు ఇతర పదవులు ఇచ్చారు. మరికొందరు నేతలకు వారం రోజుల్లో నామినేటెడ్‌ పదవులు, పార్టీలో ఖాళీగా ఉన్న సంస్థాగత పదవుల్లో నియమించనున్నారు.

అగ్రనేతలను కలిసిన మల్లు రవి

నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆశిస్తున్న పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సోదరుడు మల్లు రవి బుధవారం దిల్లీలో పార్టీ అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం సూచనల మేరకే రవిని ఇటీవల దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కేబినెట్‌ హోదాలో సీఎం నియమించారు. కానీ, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఇవ్వాల్సిందేనని ఆ పదవికి రవి రాజీనామా చేశారు. అదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు పోటీ పడుతున్నారు. మరోవైపు, భట్టివిక్రమార్క సతీమణి ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్నారు. భట్టి కుటుంబ సభ్యులు రెండు నియోజకవర్గాల టికెట్లు ఆశిస్తుండటంతో.. అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్‌ గాంధీ పోటీ చేయకపోతే ఖమ్మం టికెట్‌ తనకివ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి గట్టిగా కోరుతున్నారు. బీసీలకు జహీరాబాద్‌, మెదక్‌, సికింద్రాబాద్‌ టికెట్లు ఇవ్వాలని పార్టీలో చర్చ సాగుతోంది. వరంగల్‌ టికెట్‌ను అఖిల భారత విద్యుత్‌ ఇంజినీర్ల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి పరికి సదానందానికి ఇవ్వాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆ సమాఖ్య ఛైర్మన్‌ శైలేంద్ర దూబే తాజాగా లేఖ రాశారు.

కనీసం ఒక్కో సీటు కోరుతున్న వామపక్షాలు

ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో చెరి ఐదు స్థానాలు తమకు ఇవ్వాలని సీపీఐ, సీపీఎంలు అడుగుతున్నట్లు సమాచారం. తాము పెద్దపల్లి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లు కోరామని, ఒక్కటైనా కచ్చితంగా కేటాయిస్తారని భావిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ‘ఈనాడు’కు తెలిపారు. సీపీఎం కూడా కనీసం ఒక నియోజకవర్గాన్ని కచ్చితంగా కేటాయించాలని కోరుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా, వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పీఈసీలో ఎలాంటి చర్చలు జరగలేదని, అధిష్ఠానం నుంచి సూచనలేమీ అందలేదని సీనియర్‌ సభ్యుడొకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని