కాళేశ్వరం.. స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం

కాళేశ్వరం ప్రాజెక్టు.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 29 Feb 2024 02:59 IST

భారాస అవినీతి వల్లే ‘మేడిగడ్డ’ కుంగింది
కేసీఆర్‌ అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గత భారాస ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్‌ సర్వనాశనం చేశారని, లాభదాయకం కాని ప్రాజెక్టును కట్టారని అన్నారు. మేడిగడ్డ కుంగుబాటు, పియర్స్‌ దెబ్బతినడంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలిన అంశాలను విజిలెన్స్‌ డీజీ బుధవారం తనను కలిసి వివరించారని తెలిపారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై చట్టప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన ప్రకటనపై ఉత్తమ్‌ స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మీలాగా (కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ) మేడిగడ్డను మేం నిషేధిత ప్రాంతంగా మార్చలేదు. మీరంతా వెళ్లి ఏం చేస్తారు? కాశేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్‌ చేశానని చెప్పుకొన్న కేసీఆర్‌ చూడాలి. కుంగిన మేడిగడ్డ సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ, కాళేశ్వరంలో భాగమైన ఇతర ప్రాజెక్టులను భారాస నేతలకు చూపించేందుకు సహకరించాలని, వారికి అవసరమైన వసతులు కల్పించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే భారాస రాజకీయ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

వేల కోట్లు దోచుకున్నారు

‘కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ.38,500 కోట్లే. ముంపు ప్రాంతాలకు రూ.600 కోట్ల పరిహారమిస్తే సరిపోయేది. కమీషన్ల కక్కుర్తితో.. డిజైన్‌ మార్చి అంచనా వ్యయం పెంచారు. నిపుణుల సిఫార్సుల్ని కాదని అశాస్త్రీయంగా నిర్మించారు. ఇప్పటికే రూ.94 వేల కోట్లు వెచ్చించారు. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు 97 వేల ఎకరాలే. ఐదేళ్లలో ఎత్తిపోసింది 160 టీఎంసీలే. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.1.47 లక్షల కోట్లు కావాలి. డీపీఆర్‌ లేకుండా రూ.25 వేల కోట్ల పనులిచ్చారు. కాళేశ్వరం నిర్మాణంలో రూ.వేల కోట్లు దోచుకున్నారు. భారాస పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లయితే కొత్తగా అందుబాటులో వచ్చిన ఆయకట్టు 15 లక్షల ఎకరాలే. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు ఒక్కో ఎకరాకు రూ.11.45 లక్షల చొప్పున ఖర్చు చేశారు.

ఎప్పటికీ గుదిబండే..

కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహిస్తే ఏడాదికి విద్యుత్తు బిల్లులే రూ.10 వేల కోట్లు కావాలి. ఒకేసారి అన్ని పంపులు నడిపితే రాష్ట్రం మొత్తం వినియోగించే కరెంటు కంటే అధికంగా అవసరం. అప్పులపై వార్షిక వడ్డీ భారం రూ.15 వేల కోట్లు. విద్యుత్తు బిల్లులు, వడ్డీ కలిపి.. ప్రతి సంవత్సరం రాష్ట్రంపై రూ.25 వేల కోట్ల భారం పడుతుంది. ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండ కాబోతోంది. ప్రాజెక్టును నాశనం చేసిన భారాస నేతలు.. కాఫర్‌ డ్యాం కడితే చాలంటూ ఉచిత సలహాలివ్వడం దారుణం.

నేషనల్‌ డ్యాం సేఫ్టీ సూచనల ప్రకారం..

మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యాంలపై విచారణ చేయాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ)ని కోరాం. ఎన్డీఎస్‌ఏ సూచనల ప్రకారం ముందుకెళ్తాం. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ నివేదిక రాగానే చట్టప్రకారం ముందుకు వెళ్తాం. తప్పుడు నిర్ణయాలపై చర్యలుంటాయి. సిటింగ్‌ జడ్జితో విచారణపై మరోసారి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కోరడమా.. లేదంటే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపించడమా అనే దానిపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయిస్తాం. మల్లన్నసాగర్‌ డేంజర్‌ జోన్‌లో ఉందని ‘కాగ్‌’ చెప్పింది. ప్రస్తుతం అందులో పూర్తిస్థాయిలో నీళ్లు లేవు. అయినా ఓసారి పరీక్షించి నిర్ణయం తీసుకుంటాం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించే ఆలోచనే లేదు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని