సంక్షిప్త వార్తలు (5)

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత గొల్లపల్లి సూర్యారావు వైకాపాలో చేరారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.

Updated : 29 Feb 2024 06:26 IST

వైకాపాలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత గొల్లపల్లి సూర్యారావు వైకాపాలో చేరారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. పార్టీ కండువా కప్పి ఆయన్ను ముఖ్యమంత్రి వైకాపాలోకి ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజవర్గానికి చెందిన తెదేపా నేత స్టాలిన్‌బాబు కూడా సూర్యారావుతోపాటు వైకాపాలో చేరారు.


సిద్ధం సభ మార్చి 10కి వాయిదా

మేదరమెట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు వద్ద నిర్వహించే సిద్ధం మహాసభే చివరిదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పి.గుడిపాడు వద్ద సభ ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. మార్చి 3న నిర్వహించాల్సిన ఈ సభ కొన్ని కారణాల వల్ల 10వ తేదీకి వాయిదా పడిందన్నారు. 100 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో వైకాపా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని చెప్పారు.


తెదేపాలో చేరిన వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.నాగరాజు, రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఛైర్మన్‌ బి.శ్రీనివాసులు తెదేపాలో చేరారు. వీరితోపాటు రాయలసీమకు చెందిన వివిధ విద్యార్థి సంఘాల నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. తెదేపాలో చేరిన వారిలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ కోకన్వీనర్‌ సి.రాజు, రాయలసీమ యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్‌ కె.చంద్రశేఖర్‌, సహ కన్వీనర్‌ జి.లక్ష్మణ్‌, గిరిజన విద్యార్థి ఫెడరేషన్‌ నాయకుడు పి.వెంకటేశ్‌ తదితరులున్నారు.


కేంద్ర నిధులతో జగన్‌ ప్రచారం: విజయకుమార్‌

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయం కూడా సీఎం జగన్‌ తన ఖాతాలో వేసుకుని అబద్ధాలు చెబుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్‌ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు రైతుభరోసా కింద రూ.34,288 కోట్లు ఇచ్చినట్లు జగన్‌ అబద్ధాలు చెబుతున్నారు. ఇందులో 45% కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిందే. ధాన్యం కొనుగోళ్లపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చెల్లించిన రూ.65 వేల కోట్లు కూడా తానే ఖర్చు చేసినట్లు జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారు. తెదేపా హయాంలో రైతుల సంక్షేమానికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైకాపా పాలనలో ఆ మొత్తం రూ.18 వేల కోట్లకు మించలేదు’ అని మండిపడ్డారు.


సీఏఏ అమలుకు భాజపా కుట్ర: సీపీఐ

ఈనాడు, అమరావతి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ‘ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా మతరూపం మరోసారి విజృంభిస్తోంది. ముస్లింలను అణచివేసే వివాదాస్పద సీఏఏ అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోంది. ఇది రాజ్యాంగంలోని లౌకికతత్వానికి విరుద్ధం. ప్రతి ఒక్కరూ మోదీ సర్కార్‌ దుందుడుకు చర్యలను ఖండించాలి’ అని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని