వైకాపాలో ఉండలేను.. ఆత్మగౌరవాన్ని చంపుకోలేను

‘ఆత్మగౌరవాన్ని చంపుకొని వైకాపాలో కొనసాగలేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని’ వైకాపా నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

Published : 29 Feb 2024 06:14 IST

చాలా బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి
రాజీనామా ప్రకటించిన ఎంపీ మాగుంట
ఒంగోలు నుంచి రాఘవ్‌రెడ్డి పోటీ చేస్తారని వెల్లడి

ఈనాడు, ఒంగోలు: ‘ఆత్మగౌరవాన్ని చంపుకొని వైకాపాలో కొనసాగలేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని’ వైకాపా నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా లాంఛనమేనని వెల్లడించారు. ఒంగోలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మా కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు. 33 ఏళ్లలో ఎనిమిదిసార్లు పార్లమెంట్‌, రెండుసార్లు శాసనసభ, ఒకసారి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేశాం. దిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, నెల్లూరుల్లో నివాసాలున్నప్పటికీ.. ప్రకాశం జిల్లావాసులతోనే మాకు బలమైన అనుబంధం. అందుకే ఇక్కడ మాగుంట అంటే ఒక బ్రాండ్‌ అయింది. మా కుటుంబానికెప్పుడూ అహం లేదు ఆత్మగౌరవం తప్ప. అలాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చాలా బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో మా కుమారుడు మాగుంట రాఘవ్‌రెడ్డిని ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని మా కుటుంబం నిర్ణయించుకుంది. ఇంతకాలం సహకారం అందించిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు’ అని మాగుంట అన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానని తెలిపారు. ఆయన ఇప్పటికే తెదేపా ముఖ్య నాయకులతో చర్చించినట్లు సమాచారం. కుమారుడికి ఒంగోలు పార్లమెంట్‌ బరి నుంచి పోటీకి హామీ లభించిన తర్వాతే రాజీనామా చేశారని తెలిసింది. తెదేపా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాగుంటను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఒకే వేదికపై మాగుంట, బాలినేని..

రాజీనామా ప్రకటన అనంతరం మాగుంట ఒంగోలులో ఏపీ ఎన్జీవో సంఘం నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. కలిసే భవనాన్ని ప్రారంభించారు. ఇదే వేదికపై బాలినేని మాట్లాడుతూ.. మాగుంట తెదేపాలోకి వెళితే బాలినేని కూడా వెళ్లాలని ఏమీ లేదని.. తనది పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం కాదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని