వైకాపా అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు

‘‘మన ఐక్యతను చెడగొట్టేందుకు, రాష్ట్రం బాగుపడకుండా చూసేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు.

Updated : 29 Feb 2024 07:15 IST

వాళ్లు గెలిస్తే ప్రజలకు రక్షణ ఉంటుందా?
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజం
సైకో జగన్‌ను సాగనంపాలని ప్రజలకు పిలుపు
రాష్ట్రాన్ని నిలబెట్టే బ్లూప్రింట్ తమ వద్ద ఉందని వెల్లడి
(తాడేపల్లిగూడెం సభాప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి)

‘‘మన ఐక్యతను చెడగొట్టేందుకు, రాష్ట్రం బాగుపడకుండా చూసేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. కానీ కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను రెండు పార్టీల నాయకులం తీసుకుంటాం’’


‘‘మనలో ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఒక పార్టీ వెనకాల మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలూ కలసి అడుగులు వేస్తున్నాయి’’

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు


వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించి, జగన్‌ అనే సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు జగన్‌ స్కెచ్‌ వేస్తే.. దెబ్బతిన్న రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు తెదేపా, జనసేన కూటమి దగ్గర పెద్ద బ్లూప్రింట్ ఉందని ఆయన తెలిపారు. ‘ఇప్పటికే ప్రకటించిన తెదేపా, జనసేన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్నవాళ్లు. వైకాపా అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. వాళ్లు గెలిస్తే ప్రజలకు రక్షణ ఉంటుందా? రాష్ట్రానికి బూతులు, మాఫియా నేతలు కావాలా? ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలా?’ అని ఆయన ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బుధవారం జనసేన, తెదేపా సంయుక్తంగా నిర్వహించిన తొలి ఉమ్మడి ఎన్నికల ప్రచారసభలో.. భారీసంఖ్యలో హాజరైన ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తెదేపా, జనసేన కూటమి తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్ని చూసి జగన్‌లో వణుకు మొదలైందని, అందుకే వైకాపా అభ్యర్థుల్ని మళ్లీ మారుస్తానంటున్నారని పేర్కొన్నారు. ‘అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా త్వరలో బీసీ, ఎస్సీ డిక్లరేషన్‌లు ఇస్తాం. ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు, ఉద్యోగులకు మేలు చేసే అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. కానీ జగన్‌ అనే ఈ మాఫియా పాలకుడు, దోచుకున్న డబ్బుతో మళ్లీ ప్రజల వద్దకు ఓట్లడగడానికి వస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ సైకోకు తల్లీ, చెల్లీ విచక్షణ లేదు

‘జగన్‌కు తల్లి, చెల్లి అనే విచక్షణ కూడా లేదు. ఆస్తి తగాదాల వల్లో, ప్యాలెస్‌ గొడవల వల్లో సొంత చెల్లెలు జగన్‌తో విభేదించి వేరే పార్టీలో చేరితే... ఆమెపైనా, తల్లిపైనా కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టించారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవాలి’ అని అన్నారు. ‘నిలువెత్తు అహంకారానికి నిదర్శనం జగన్‌. ఇప్పటం గ్రామ ప్రజలు పవన్‌ కల్యాణ్‌ సభకు స్థలం ఇచ్చారని ఇళ్లు కూలగొట్టించారు. అదీ ఈ సీఎం విధానం’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

అది ముమ్మాటికీ సైకో లక్షణమే

‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సైకో.. ఒంటరి మహిళల్ని వరుసగా హత్యలు చేసేవాడు. రాళ్లతో తలపై కొట్టి క్రూరంగా చంపేసేవాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అతను గతంలో జైలుకి వెళ్లి వచ్చాడని, ఏ కారణం చేతనో మహిళలంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఆ సైకో 40 మందిని చంపేశాడని తేలింది. ఆ తర్వాత అతను ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. జగన్‌ను చూస్తే ఆ ఘటనే గుర్తుకు వస్తుంది. ఆయనకు డబ్బులు కావాలి. అందుకోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాజకీయానికి, వ్యాపారానికి అడ్డు వస్తే చంద్రబాబు అయినా, పవన్‌ అయినా, ప్రజలైనా లెక్కలేదు. అందర్నీ అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘నేను, నా మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఆలోచించేది.. తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలనే. అందుకే చేతులు కలిపాం రాష్ట్రాన్ని కాపాడేందుకు అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం ఏదో వాళ్లబ్బ సొత్తన్నట్టు పవన్‌ కల్యాణ్‌ను రాకూడదని ఆంక్షలు పెట్టారని, విశాఖ వీధుల్లో తిరగకూడదంటూ హోటల్లోనే కట్టడి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ‘వాళ్ల అహంభావం ఎలా ఉందంటే.. సినిమా టికెట్‌ల ధరల్ని నియంత్రించి సినీ ప్రముఖుల్ని శాసించే స్థితికి వెళ్లారు. ప్రముఖ నటుడు చిరంజీవిని, ప్రముఖ దర్శకుడు రాజమౌళిని అవమానించిన తీరు చూసి చాలా నొచ్చుకున్నాను’ అని తెలిపారు.

వైనాట్‌ పులివెందుల అంటున్నారు  

‘జగన్‌ వైనాట్‌ 175 అంటున్నారు. ఏం పొడిచారని మీకు ఓటెయ్యాలి?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వైనాట్‌ జాబ్‌ క్యాలెండర్‌. వైనాట్‌ డీఎస్సీ? వైనాట్‌ ఉచిత ఇసుక? ముందు వీటికి జగన్‌ సమాధానం చెప్పాలి. పోనీ అవన్నీ వదిలి పెట్టండి. హూ కిల్డ్‌ బాబాయ్‌? దీనికి సమాధానం చెప్పమని జగన్‌కు సవాల్‌ విసురుతున్నాను’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా వైనాట్‌ పులివెందుల అంటున్నారని, అక్కడ కూడా జగన్‌ను ఓడించాలని ఆయన పేర్కొన్నారు. ‘జగన్‌ పచ్చి అబద్ధాల కోరు. ఊళ్లల్లో కనికట్టు చేసేవాళ్లకీ ఆయనకూ తేడా లేదు. 25 మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. మద్యం నిషేధిస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని గొప్పలు చెప్పారు. ఎందుకు చేయలేదు?’ అని మండిపడ్డారు.

అగ్నికి వాయువు తోడైంది.. ఇక వైకాపా బుగ్గే

‘కుప్పానికి నీళ్లిస్తున్నామంటూ జగన్‌ నాటకమాటారు. ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్లి కాలువల్లో పోశారు. సినిమా సెట్టింగ్‌ల్లా గేట్లు తెచ్చిపెట్టి... నీళ్లు వదిలి వెళ్లారు. మర్నాటికి అక్కడ నీళ్లూ లేవు. గేట్లూ లేవు. అదీ ఈ సీఎం విశ్వసనీయత’ అని మండిపడ్డారు. జగన్‌ నాటకాల్ని కుప్పం ప్రజలు పట్టించుకోరని, వచ్చే ఎన్నికల్లో అక్కడ తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రశాంతమైన రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో జగన్‌ అగ్గి రాజేశారు. ఇప్పుడు అదే అగ్గితో తెదేపా, జనసేన తమ్ముళ్లు వైకాపాను తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అగ్గికి పవన్‌ రూపంలో వాయువు కూడా తోడైంది. ఇక వైకాపా బుగ్గవడమే మిగిలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రానికి మేలు చేసేందుకే మహోద్యమానికి శ్రీకారం చుట్టాం. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కొట్టే దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలు ముక్కలవ్వాలి. పొత్తు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. ప్రజల బతుకులు వెలగాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని