వీధి వ్యాపారాలకు ఆశీలు రద్దు చేస్తాం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధి వ్యాపారులకు ఆశీలు రద్దు చేస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 29 Feb 2024 03:36 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ
మంగళగిరిలో యూరో కార్ట్‌ సేవలు ప్రారంభం
లబ్ధిదారులకు శిక్షణ, బ్యాంకుల ద్వారా రుణాలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధి వ్యాపారులకు ఆశీలు రద్దు చేస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న ఆయన బుధవారం మరో పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారుల ఆదాయాన్ని కనీసం 50 శాతం పెంచే దిశగా ఎన్నారై తెదేపా సహకారంతో ‘యూరో కార్ట్‌’ సేవలను లోకేశ్‌ ప్రారంభించారు. తొలి విడతగా 50 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి కార్ట్‌లు అందజేశారు. వారికి రోజువారీ అవసరమయ్యే సరకులను ప్రముఖ వ్యాపార సంస్థల వారు బండ్ల వద్దకే పంపే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లావాదేవీల సేవలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తుందన్నారు. ఎన్నారై తెదేపాకు చెందిన ప్రవాస భారతీయుడు గుంటుపల్లి జయకుమార్‌, మురళీ రాపర్ల సహకారంతో రూపొందించిన ఈ పథకాన్ని తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. సీఎం జగన్‌ వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాల పేరుతో రూ. 10 వేలు ఇస్తూ, ఆశీలు పేరుతో ఏటా రూ. 10,800 లాగేస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆశీలు రద్దుచేస్తామని చెప్పారు. యూరో కార్ట్‌లు పొందిన లబ్ధిదారులకు బ్యాంక్‌ ద్వారా పెట్టుబడి సమకూరుస్తామని.. దానివల్ల వారికి అడ్డగోలు వడ్డీల బెడద ఉండదని పేర్కొన్నారు. వారి బండ్ల వద్దే లైసెన్స్‌లు ఇచ్చి పోలీసు వేధింపులు లేకుండా చేస్తామన్నారు. రోడ్డు పక్కన ఆహార పదార్థాలను విక్రయించేవారికి పరిశుభ్రత, ఆహార నాణ్యత విషయంలో వెస్టిన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ వారితో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, ఎన్నారై తెదేపాకు చెందిన గుంటుపల్లి జయకుమార్‌, ఎన్నారై వేమూరి రవి, యూరో కార్ట్‌ డిజైనర్‌ కృష్ణంరాజు, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని