జగన్‌ అవినీతిపై కేంద్రం మౌనం ఎందుకు?

సీఎం జగన్‌ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

Published : 29 Feb 2024 03:36 IST

భాజపాకు జగన్‌ బీ టీం కాదు.. జగన్‌ ఉన్నది భాజపాలోనే
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. జగన్‌ ఇక్కడ మైనింగ్‌, లిక్కర్‌, ఇసుక మాఫియా చేస్తున్నారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారని ఆమె అన్నారు. రాష్ట్రాల పట్ల వాచ్‌డాగ్‌గా ఉన్న కేంద్రం.. జగన్‌ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని షర్మిల నిలదీశారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘ఏపీలో అన్యాయం జరుగుతుందని తెలుసు. కేంద్రంలో మీరు (భాజపా) అధికారంలో ఉన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై మీకు సమాచారం తెలిసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? జగన్‌ భాజపాలోనే ఉన్నారనడానికి వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. జగన్‌పై కేంద్రం చర్యలు లేవంటే ఆయన భాజపాలోనే ఉన్నారని అర్థం. భాజపాకు జగన్‌ బీ టీం కాదు... జగన్‌ ఉన్నది భాజపాలోనే’ అని షర్మిల విమర్శించారు.

ప్రత్యేకహోదాపై తిరుపతి వేదికగా డిక్లరేషన్‌

‘కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో శుక్రవారం నిర్వహించే బహిరంగసభలో రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై డిక్లరేషన్‌ ఇస్తున్నాం. హోదాపై ఎవరికీ చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చాక హోదా ఊసే ఎత్తలేదు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి వేదికగా భాజపా ప్రకటించి మాట తప్పింది’ అని షర్మిల ధ్వజమెత్తారు.

రాష్ట్ర హక్కులు మోదీ కాళ్ల దగ్గర తాకట్టు

‘జగనన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హక్కులను ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని అన్లేదా? హోదా కోసం నిరాహారదీక్షలు చేయలేదా? జగనన్న అధికారంలోకి వచ్చాక మాట మార్చారు’ అని షర్మిల మండిపడ్డారు. ‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 1.18% ఓట్లే వచ్చాయి. అయినా వైఎస్‌ఆర్‌ బిడ్డ కాంగ్రెస్‌లో చేరిందంటే... విభజన హామీల సాధన కోసమే. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేకహోదాపై మొదటి సంతకం చేస్తామని రాహుల్‌గాంధీ ఇప్పటికే హామీ ఇచ్చారు’ అని షర్మిల వివరించారు.


కాంగ్రెస్‌ టికెట్‌ ఆశావహులతో షర్మిల ముఖాముఖి

ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన ఆశావహులతో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల బుధవారం ముఖాముఖి నిర్వహించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న 280 మందితో చర్చించారు. పలువురితో ఆమె విడివిడిగా మాట్లాడారు. రాజకీయ, కుటుంబ నేపథ్యం, కాంగ్రెస్‌లో ఎప్పటినుంచి పని చేస్తున్నారు? ఏయే హోదాల్లో పార్టీకి సేవలందించారు? టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో గెలుపొందేందుకున్న అవకాశాలు తదితర విషయాలపై ఆమె సమగ్రంగా చర్చించారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపైనా ఆరా తీశారు. మరో 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన వారితో గురువారం ఆమె సమావేశమవనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని