ఎన్డీయేకు 400 సీట్లివ్వడానికి దేశం సిద్ధం: మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈసారి 400 పైగా స్థానాల్లో విజయం అందించాలని దేశం ఇప్పటికే నిర్ణయించుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.

Published : 29 Feb 2024 06:23 IST

యవత్మాల్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈసారి 400 పైగా స్థానాల్లో విజయం అందించాలని దేశం ఇప్పటికే నిర్ణయించుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. గత ఎన్నికల కంటే ఈసారి మరింత మెజారిటీని కూటమి సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాబోయే అయిదేళ్లలో తమ సర్కారు ఇంకా వేగంగా అభివృద్ధి పనులు చేపడుతుందని చెప్పారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా భరిలో బుధవారం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పీఎం కిసాన్‌ నిధుల విడుదలతో పాటు రూ.వేల కోట్ల అభివృద్ధి పనులను ముందుగా ప్రారంభించారు. గత పదేళ్లలో తమ సర్కారు చేపట్టిన పనులతో దేశానికి మరో పాతికేళ్లకు కావాల్సిన బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలకు సాధికారత కల్పించే పనులు ఇకపై ఇంకా ఊపందుకుంటాయని చెప్పారు. విదర్భ ప్రాంతం సహా దేశంలో 100 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్‌ సర్కారు పెండింగులో పెట్టిందని మోదీ విమర్శించారు. 2004-14 మధ్య యూపీయే హయాంలో శరద్‌పవార్‌ కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా అది లబ్ధిదారుల్ని చేరడానికి ముందే స్వాహా అయిపోయేదని చెప్పారు. పేదలు, ఆదివాసీలు, రైతులకు వాటినుంచి ఏమీ లభించేది కాదన్నారు. బుధవారం ఒక్క క్లిక్‌తో రూ.21,000 కోట్ల నిధులు 9 కోట్లమంది రైతుల ఖాతాల్లోకి బదలాయించానని, మోదీ గ్యారంటీ అంటే అది అని చెప్పారు. కాంగ్రెస్‌గానీ అధికారంలో ఉండిఉంటే దీనిలో 85% మొత్తాన్ని మధ్యలోనే స్వాహా చేసేసేవారని అన్నారు. తాగునీరు, సాగునీరు ప్రాముఖ్యత గురించి విపక్ష కూటమికి ఏమీ పట్టదని విమర్శించారు.

7న శ్రీనగర్‌లో పర్యటన

మోదీ మార్చి 7న జమ్మూ-కశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌కు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన ఈ పర్యటనలో శంకుస్థాపనలు చేసి, కేంద్ర ప్రాయోజిత పథకాల లబ్ధిదారులతో వీడియో సదస్సు ద్వారా ముచ్చటించనున్నారు. ప్రధాని కార్యక్రమాన్ని కశ్మీర్‌ లోయలో పలు ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాని ఇటీవలే జమ్మూలో పర్యటించి రూ.32,000 కోట్ల పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని