హిమాచల్‌లో రాజకీయ సంక్షోభం

హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలో పడిపోయింది.

Published : 29 Feb 2024 06:23 IST

మైనారిటీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం
రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలో పడిపోయింది. మంగళవారం రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాకు ఓటేయడంతోపాటు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఆ పార్టీకి మద్దతు పలకడంతో శాసనసభలో కాంగ్రెస్‌, భాజపాల బలాలు సమానమయ్యాయి. దీంతోపాటు బుధవారం రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లో పడింది. ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భాజపా నిర్ణయించినట్లు సమాచారం. మాజీ సీఎం జైరాం ఠాకుర్‌ నేతృత్వంలోని భాజపా శాసనసభా పక్షం బుధవారం గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కలిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ పార్టీ నేతలు భూపేందర్‌ సింగ్‌ హుడా, భూపేశ్‌ బఘెల్‌ శిమ్లాకు వచ్చారు. ఏఐసీసీ నేత రాజీవ్‌ శుక్లా ఇప్పటికే శిమ్లాలో ఉన్నారు. తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడినట్లు తెలుస్తోంది. అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి గురువారం సాయంత్రంలోగా పరిశీలకులు నివేదిక ఇస్తారని, ఆ తరువాత ఖర్గే కఠిన నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ దిల్లీలో వెల్లడించారు. సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్ఖూ రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. సీఎం తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు వెల్లడించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే వాటిని ఆయన ఖండించారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం తనను కోరలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

తిరిగొచ్చిన ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు ఓటేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్‌ (క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డ) ఎమ్మెల్యేలు శిమ్లా నుంచి హరియాణాకు వెళ్లారు. తొలుత పంచకులలోని అతిథి గృహానికి వెళ్లిన వారు ఆ తర్వాత అజ్ఞాత ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం శిమ్లాకు తిరిగివచ్చారు. 

భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

హిమాచల్‌లో బుధవారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో 15 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పథానియా సభ నుంచి సస్పెండు చేశారు. వీరిలో శాసనసభలో ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్‌ ఉన్నారు. ఆ తరువాత సభలో బడ్జెట్‌ ఆమోదం పొందింది. విధేయత మార్చిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో బడ్జెట్‌కు ఇబ్బంది కాలేదు. సుక్ఖూ సర్కారుకూ కాస్త ఉపశమనం లభించింది.

సమానమైన బలం

68 మంది సభ్యులున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40, భాజపాకు 25 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు భాజపాకు ఓటేశారు. దీంతో కాంగ్రెస్‌, భాజపాలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో భాజపాకు చెందిన హర్ష్‌ మహాజన్‌ను అదృష్టం వరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ పరాజయం పాలయ్యారు. 

అనర్హతపై విచారణ

రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ పథానియా విచారణ ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం తీర్పును ఆయన రిజర్వు చేశారు.


అసంతృప్తితో మంత్రి రాజీనామా

సుఖ్వీందర్‌ తీరుపై మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంక్షోభం నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు రాజీనామా సమర్పించినట్లు బుధవారం ఆయన తెలిపారు. అయితే పార్టీ పరిశీలకులతో మాట్లాడిన అనంతరం ఆయన యూ టర్న్‌ తీసుకున్నారు. తాను రాజీనామాపై ఒత్తిడి తేవడం లేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని