రాముడి గురించి తప్పుగా మాట్లాడలేదు: పొన్నం

రాముడి గురించి తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే.. తాను ఆత్మాహుతి చేసుకోవడానికైనా సిద్ధమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated : 29 Feb 2024 06:51 IST

బండి సంజయ్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్న మంత్రి 

వేములవాడ, హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: రాముడి గురించి తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే.. తాను ఆత్మాహుతి చేసుకోవడానికైనా సిద్ధమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల భాజపా ఎంపీ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలోనూ ఆయన సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించారు. ‘సంజయ్‌ ప్రసంగాల వీడియో చూస్తే మా అమ్మను కించపరిచినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. నేను మాత్రం ప్రశాంతంగా ఇది మంచిది కాదని చెబుతున్నాను. కానీ సంజయ్‌ మళ్లీ హుస్నాబాద్‌ చౌరస్తాలో నా తల్లి ఆత్మ క్షోభిస్తుందంటూ జీవించి ఉన్న ఆమె గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు. రాముడి జన్మ గురించి నేను అనని మాటలను అన్నట్లుగా ఎంపీ సంజయ్‌ ఆపాదిస్తున్నారు. భాజపా నాయకులు రాముడిని రాజకీయాల్లోకి తెచ్చి వాడుకుంటున్నారని మాత్రమే నేను విమర్శించాను. నేను శాకాహారిని. హిందూ భక్తుడిని. మీడియా ముందు బండి సంజయ్‌ దొంగజపం చేస్తున్నారు. అయిదేళ్లలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ఎందుకు రావడం లేదు? హిందువని చెప్పుకొనే సంజయ్‌.. వేములవాడ ఆలయానికి ఏం చేశారో చెప్పాలి’ అని మంత్రి డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ యాత్రను అడ్డుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. దాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా అడ్డుకోవద్దని మంత్రి పొన్నం సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని