పురపాలక ఛైర్‌పర్సన్ల ఎన్నికల్లో హస్తం జోరు

పురపాలిక ఛైర్‌పర్సన్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగుచోట్ల ఎన్నికలు నిర్వహించగా మూడు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

Published : 29 Feb 2024 04:00 IST

భువనగిరి, సుల్తానాబాద్‌, నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ వశం
గెలుపొందగానే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కలిసిన జగిత్యాల ఛైర్‌పర్సన్‌

భువనగిరి పట్టణం, సుల్తానాబాద్‌, జగిత్యాల, నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: పురపాలిక ఛైర్‌పర్సన్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగుచోట్ల ఎన్నికలు నిర్వహించగా మూడు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరోచోట ఛైర్‌పర్సన్‌గా గెలుపొందిన మహిళ అధికార పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. భువనగిరిలో ఛైర్మన్‌ పదవి కాంగ్రెస్‌కు వైస్‌ ఛైర్మన్‌ భాజపాకు దక్కడం గమనార్హం.

  • యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలిక భారాస ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లపై ఇటీవల పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో బుధవారం కొత్త ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికకు సమావేశం నిర్వహించారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా 29 మంది, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఛైర్మన్‌ ఎన్నిక బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోతంశెట్టి వెంకటేశ్వర్లు, భాజపా అభ్యర్థిగా బొర్ర రాకేశ్‌ నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా అభ్యర్థికి ఐదుగురు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 17మంది సభ్యులు మద్దతు పలికారు. దీంతో వెంకటేశ్వర్లు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌ పదవికి భాజపా నుంచి మాయ దశరథ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి జయశ్రీ ప్రకటించి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా భారాస అసమ్మతి, రెండోవార్డు కౌన్సిలర్‌ గాజుల లక్ష్మి ఎన్నికయ్యారు. 15 మంది కౌన్సిల్‌ సభ్యులకుగాను ఆరుగురు భారాస, ఐదుగురు కాంగ్రెస్‌ మొత్తం 11 మంది హాజరై లక్ష్మికి మద్దతు తెలిపారు. ఆర్డీవో మధుమోహన్‌ ఆమెకు నియామకపత్రం అందించి ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె భర్త రాజమల్లుతో సహా ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పురపాలక ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్‌ స్వరూప్‌ శెట్కార్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా దారం శంకర్‌ ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లకుగాను 11 మంది, ఎక్స్‌ అఫీషియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరయ్యారు. ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్‌పర్సన్‌లకు సంబంధించి ఒక్కో దరఖాస్తు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించిన నిమ్జ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వసంతకుమారి ప్రకటించారు.
  • జగిత్యాల జిల్లా జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌గా భారాసకు చెందిన 36వ వార్డు కౌన్సిలర్‌ అడువాల జ్యోతి కాంగ్రెస్‌, భారాస, భాజపా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల సహకారంతో ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 48 వార్డులకుగాను ఒక స్థానం ఖాళీగా ఉండగా ఓ కౌన్సిలర్‌ హాజరవలేదు. భారాస సమిండ్ల వాణిని ప్రతిపాదించగా స్థానిక ఎమ్మెల్యే, ఎక్స్‌ అఫీషియో సంజయ్‌కుమార్‌తో కలిపి 23 ఓట్లు రాగా అడువాల జ్యోతికి 24 ఓట్లు వచ్చాయి. ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన వెంటనే జ్యోతి, 9 మంది భారాస, పలువురు స్వతంత్ర కౌన్సిలర్లు నేరుగా ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. 9 మంది భారాస కౌన్సిలర్లు విప్‌ ధిక్కరించారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొనగా.. తమకు విప్‌ జారీ చేయలేదని జ్యోతి చెప్పారు. ఛైర్‌పర్సన్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ఛైర్‌పర్సన్‌గా ఉన్న బోగ శ్రావణి గతేడాది జనవరిలో రాజీనామా చేసి భాజపాలో చేరడంతో ఎన్నిక అనివార్యమైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని