పీవీ వల్లే కాంగ్రెస్‌ బతికింది: బండి సంజయ్‌

కాంగ్రెస్‌, భారాసలు మహనీయులను అవమానించిన పార్టీలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

Published : 29 Feb 2024 04:03 IST

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భారాసలు మహనీయులను అవమానించిన పార్టీలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ, గట్లనర్సింగాపూర్‌, వంగర, భీమదేవరపల్లి, ములుకనూర్‌ గ్రామాల్లో సాగింది. వంగరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగృహాన్ని సంజయ్‌ సందర్శించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పీవీ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం సంతోషదాయకమన్నారు. ప్రధాని మోదీని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. కాంగ్రెస్‌ బతికి బట్టకట్టిందంటే అది పీవీ చలవేనని పేర్కొన్నారు. పీవీ మృతి చెందిన తర్వాత అంత్యక్రియలు సరిగా నిర్వహించకుండా కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. దీనిపై ఆ పార్టీ నేటికీ సమాధానం చెప్పలేదన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందని.. ఎన్నికల్లో ఓడించిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికలొస్తేనే పీవీ గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. పీవీ మనవడు సుభాష్‌, భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంజయ్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి..

బండి సంజయ్‌ వంగరలో పీవీ స్వగృహాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా బస్టాండ్‌ కూడలి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్‌ ముందు వాహనంలో వెళ్తున్న పాత్రికేయులు, వీడియోగ్రాఫర్లపై కోడిగుడ్లు పడ్డాయి. దాడికి వ్యతిరేకంగా భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో పోలీసులు ఉండగా దాడి జరగడంపై సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బందోబస్తు అవసరం లేదని, దాడి చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని