‘మేడిగడ్డ’పై సీఎం రాజకీయం చేస్తున్నారు: కడియం శ్రీహరి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పగుళ్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని భారాస స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు.

Published : 29 Feb 2024 04:04 IST

బాలసముద్రం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పగుళ్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని భారాస స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. హనుమకొండలోని తన నివాసంలో బుధవారం ఎంపీ పసునూరి దయాకర్‌, పరకాల, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎంగా అధికారం చేపట్టాక రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి.. ప్రతిపక్షాలపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మిషన్‌ భగీరథ, కాకతీయ వంటి విజయాలను వైఫల్యాలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుకు అయిన రూ.93 వేల కోట్ల వ్యయంలో మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు, నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డలో లోపాలను గుర్తించాలని, నిర్మాణ లోపానికి బాధ్యులు ఎవరైనా చట్టపరంగా శిక్షార్హులేనని పేర్కొన్నారు. సీఎం కుర్చీని తమ పార్టీ బలవంతంగా తీసుకోదని సొంత పార్టీ వారితోనే ఆయన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేవెళ్ల సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోటా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలు గెలిచి నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని