‘కాళేశ్వరం’పై కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Published : 29 Feb 2024 05:20 IST

మాజీ మంత్రి కేటీఆర్‌

గంభీరావుపేట, సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన కరపత్రాన్ని గంభీరావుపేట మండలం మల్లుపల్లిలో పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘‘మేడిగడ్డలో కుంగిన మూడు పియర్లను తొలగించి మరమ్మతులు చేసి ప్రాజెక్ట్‌ పునరుద్ధరణ పనులను చేపట్టాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో భారాసను బద్నాం చేసే కుట్ర పన్నుతోంది. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే పనులు మానుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1న చలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

మేడిగడ్డ సందర్శనపై డీజీపీకి భారాస లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తాము మార్చి 1న మేడిగడ్డ సందర్శిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల బృందం డీజీపీ రవిగుప్తాకు లేఖ రాసింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలోని బృందం బుధవారం  డీజీపీని ఆయన కార్యాలయంలో స్వయంగా కలిసి ఈ లేఖను అందజేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, నీటిపారుదలరంగ నిపుణుల బృందం పర్యటన తెలంగాణభవన్‌ నుంచి వివిధ జిల్లాల మీదుగా సాగుతున్నందున తమ బాధ్యతగా ఈ వివరాలు లేఖ ద్వారా తెలుపుతున్నామని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల్లో ఎన్ని హామీలున్నాయో మీకు తెలుసా?: కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అసలు ఎన్ని హామీలున్నాయో సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసా? అని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబాన్ని తిట్టడమే రేవంత్‌రెడ్డి ఎజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని