గరిష్ఠ స్థానాలు.. గట్టి అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న భాజపా.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Published : 29 Feb 2024 05:19 IST

లోక్‌సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే..
ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి
నేడు భారాస ఎంపీ రాములు చేరిక..
నాగర్‌కర్నూల్‌ బరిలో ఆయన లేదా కుమారుడు!
మరికొందరు ప్రజాప్రతినిధులతోనూ చర్చలు
నేడో, రేపో తొలి జాబితా విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న భాజపా.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా భారాసకు చెందిన కొందరు ముఖ్యనేతలు, కీలక ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ సిటింగ్‌ ఎంపీ, భారాసకు చెందిన పి.రాములు భాజపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు ఆయన కుమారుడు జడ్పీటీసీ సభ్యుడు భరత్‌, ఇదే లోక్‌సభ స్థానానికి చెందిన భారాస ముఖ్యనేతలు గురువారం భాజపాలో చేరనున్నట్లు సమాచారం. కొంతకాలంగా భారాస వ్యవహారాల పట్ల అంటీముట్టనట్లున్న రాములును చేర్చుకోవడం ద్వారా నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సీటు గెలిచే అవకాశాలు మెరుగుపడతాయని భాజపా భావిస్తోంది. తద్వారా మహబూబ్‌నగర్‌ స్థానంలోనూ సానుకూలత ఉంటుందని అంచనా వేస్తోంది. రాములు లేదా ఆయన కుమారుడు భరత్‌ను నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థిగా బరిలో దింపుతారని తెలుస్తోంది. గురువారం జరిగే భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం లేదా శుక్రవారం మొదటివిడత అభ్యర్థులను ప్రకటిస్తారని.. ఇందులో రాష్ట్రానికి చెందిన ఏడెనిమిది స్థానాలకు పేర్లు వెలువడవచ్చని సమాచారం.

ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, ఖమ్మంలలోనూ..

ఆదిలాబాద్‌లోనూ ఇతర పార్టీల ముఖ్య నాయకులతో భాజపా నాయకత్వం చర్చిస్తోంది. గత ఎన్నికల్లో నెగ్గిన ఆదిలాబాద్‌ లోకసభ స్థానాన్ని గెలుచుకున్న భాజపా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీని పరిధిలోని నాలుగు సెగ్మెంట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలో దింపితే మరోసారి విజయం ఖాయమనే ధీమాతో ఆ పార్టీ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో పార్టీకి సానుకూలత ఉన్నట్లు సర్వేల్లో తేలడంతో అక్కడ నిలిపేందుకు కీలక ప్రజాప్రతినిధి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యనేత కోసం కూడా భాజపా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. చేరికలపై ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులకు స్పష్టం చేసింది.

తొలి జాబితాలో సిటింగ్‌లతోపాటు మరికొన్ని

సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌లో బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఇతర స్థానాల్లోనూ గట్టి అభ్యర్థులను గుర్తిస్తున్నామని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. నాలుగు సిటింగ్‌ స్థానాలతో పాటు మరో ఆరు.. అంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించడంపై భాజపా గురిపెట్టింది. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో సిటింగ్‌ ఎంపీలే బరిలో దిగనున్నారు. ఆదిలాబాద్‌లో సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావు స్థానంలో మరో అభ్యర్థిని బరిలో దింపుతారనే చర్చ జరుగుతోంది. తొలి జాబితాలో మూడు సిటింగ్‌ స్థానాలు, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మరో ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని