కాంగ్రెస్‌, భారాసలను నమ్మొద్దు

అవినీతి రహిత పాలన అందించి, దేశ గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇనుమడింపజేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 29 Feb 2024 05:21 IST

 విజయ సంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: అవినీతి రహిత పాలన అందించి, దేశ గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇనుమడింపజేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న విజయ సంకల్ప యాత్ర బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అరవై ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని.. ప్రజల సంపదను ఆ పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల దాడులను అరికట్టలేకపోయారని ధ్వజమెత్తారు. భాజపా పదేళ్ల పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన, దోపిడీలతో భారాస, కాంగ్రెస్‌లు భ్రష్టుపట్టాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలనూ నమ్మొద్దని ప్రజలను కోరారు. పార్టీని విస్తరించేందుకు గతంలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల డబ్బులను ఇతర రాష్ట్రాలకు తరలించారని.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ద్వారా ఇతర రాష్ట్రాలకు డబ్బులు తరలించేందుకు రాహుల్‌ గాంధీ తన బృందాలను ఇక్కడ దింపారని ఆరోపించారు. భారాసకు ఓటు వేస్తే వృథాయేనని, కాంగ్రెస్‌కు వేస్తే అవినీతి, అరాచకానికి మద్దతు ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ త్వరలోనే రాజకీయాల నుంచి విరామం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లోనూ విజయమే తమ లక్ష్యమన్నారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలే భాస్కర్‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఎం.జైపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని