కేంద్ర పథకాల లబ్ధిదారుల ఇళ్లకు భాజపా కార్యకర్తలు

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిని భాజపా రాష్ట్ర కార్యకర్తలు కలుసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాలను జాతీయ నాయకత్వం సిద్ధం చేసింది.

Published : 29 Feb 2024 05:07 IST

సెల్‌ఫోన్‌ నంబర్లతో సహా జిల్లాలకు జాబితాలు
రాష్ట్ర నేతలకు శివప్రకాష్‌ సూచనలు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిని భాజపా రాష్ట్ర కార్యకర్తలు కలుసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాలను జాతీయ నాయకత్వం సిద్ధం చేసింది. ఇందులో 40 లక్షల మంది ఏపీ నుంచి ఉన్నారని గుర్తించారు. ఈ జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తమ పథకాల గురించి వివరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై భాజపా రాష్ట్ర శాఖ నేతలు కొందరు హైదరాబాద్‌లో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. జాతీయ నాయకుడు శివప్రకాష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన 40 లక్షల మందితో కూడిన జాబితాను జిల్లాల వారీగా విభజించి, జిల్లా నాయకులకు పంపాలని నిర్ణయించారు. లబ్ధిదారుల పేర్లతో పాటు వారి సెల్‌ఫోన్‌ నంబర్లు కూడా ఉన్నాయి. మార్చి 3 నుంచి 5వ తేదీ మధ్య జిల్లా నాయకత్వం ఎంపిక చేసిన వారిలో ఒక్కొక్కరు కనీసం ఐదుగురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. కేంద్ర పథకాల ద్వారా లబ్ధిపొందిన విషయాన్ని నేరుగా వారికి వివరించి, పీఎం మోదీ పేరుతో ఉన్న ఓ కరపత్రాన్ని అందచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని తనవిగా ప్రచారం చేసుకుంటోందని జాతీయ నాయకత్వానికి భాజపా నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లబ్ధిదారులను నేరుగా కలుసుకొని వివరించేలా భాజపా సన్నాహాలు ప్రారంభించింది. పొత్తుల గురించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకునేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని