నాయుడుపేట పురపాలక వైస్‌ ఛైర్మన్‌ రాజీనామా

తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక వైస్‌ ఛైర్మన్‌, వైకాపా పట్టణాధ్యక్షుడు షేక్‌ రఫీ బుధవారం నాటకీయ పరిణామాల నడుమ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు.

Updated : 29 Feb 2024 06:24 IST

ఎమ్మెల్యేతో కలిసి పని చేయలేకేనని వెల్లడి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక వైస్‌ ఛైర్మన్‌, వైకాపా పట్టణాధ్యక్షుడు షేక్‌ రఫీ బుధవారం నాటకీయ పరిణామాల నడుమ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు తెదేపా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ ఎస్‌.విజయభాస్కర్‌ రెడ్డి, తెదేపా నాయకులు ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. రఫీ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. రఫీను పక్కన బెట్టుకుని ఆయన వైకాపాను వీడటం లేదని, పార్టీలో కొనసాగుతారని మీడియాకు వెల్లడించారు. తర్వాత రఫీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వైకాపా పట్టణాధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే కిలివేటి సంజయ్యతో కలిసి అడుగులు వేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైకాపాలోకి వచ్చాక ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని, పార్టీలో గౌరవం లేకుండా చేశారని ఆరోపించారు. తొందరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.


నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రాజీనామా

నెల్లూరు, న్యూస్‌టుడే: వైకాపా సీనియర్‌ నేత, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ పోలుబోయిన రూప్‌కుమార్‌ యాదవ్‌ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం నెల్లూరులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైకాపాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ 13 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి పని చేశానన్నారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న ఘటనలు బాధ పెట్టాయన్నారు. పార్టీకి రాజీనామా చేయడం ఎంతో బాధాకరమైన విషయమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని