రైతు ద్రోహి జగన్‌రెడ్డి

‘రైతు భరోసా’ పేరుతో అన్నదాతలనూ వంచించిన వ్యక్తిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు.

Updated : 29 Feb 2024 06:23 IST

‘రైతు భరోసా’ సాయంలోనూ పచ్చిమోసం
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘రైతు భరోసా’ పేరుతో అన్నదాతలనూ వంచించిన వ్యక్తిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయలేని అసమర్థుడు, 9గంటల ఉచిత విద్యుత్‌, గిట్టుబాటు ధర, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని వ్యక్తి రైతుల పక్షపాతి ఎలా అవుతారని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రాజేంద్రప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వ సాయాన్నీ కేవలం తన పార్టీ సానుభూతిపరులకే ఇచ్చి జగన్‌ వివక్ష చూపారు. చంద్రబాబు ఒకేసారి రూ.50 వేల చొప్పున రుణమాఫీ చేస్తే.. జగన్‌రెడ్డి అయిదేళ్లలో కొందరికే రూ.37,500ల చొప్పున ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఏటా ప్రతి రైతుకూ రూ.13,500 ఇస్తామన్న జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే సొమ్ముకు కేవలం రూ.7,500 కలిపి ఇస్తున్నారు.

రాష్ట్రంలో 82 లక్షల మంది రైతులుంటే, 52 లక్షల మందికే రైతు భరోసా సాయం అందిస్తున్నారు’ అని వెల్లడించారు. ‘చివరికి కరవు మండలాల ప్రకటనలోనూ జగన్‌ రాజకీయాలు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోకుండా.. కేంద్రానికి తప్పుడు సమాచారమిచ్చి తప్పించుకున్నారు. తేమ శాతంతో పనిలేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్న జగన్‌రెడ్డి.. రవాణా ఛార్జీలు, గోతాలకు డబ్బులు, తేమశాతం అంటూ రకరకాల కారణాలతో వైకాపా నేతలు రైతుల్ని దోచుకుంటున్నా స్పందించలేదు. విద్యుత్‌ ధరలను పెంచి ఆక్వా రంగాన్ని దెబ్బతీశారు. చేతగాని పాలనతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వ హత్యలే’ అని రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని