నేడు ‘పాలమూరు’కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించనున్నారు.

Updated : 01 Mar 2024 06:45 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ మినహా.. మిగిలిన సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), అనిరుధ్‌రెడ్డి(జడ్చర్ల), జి.మధుసూదన్‌రెడ్డి(దేవరకద్ర), చిట్టెం పర్ణికారెడ్డి(నారాయణపేట), వాకిటి శ్రీహరి(మక్తల్‌), వీర్లపల్లి శంకర్‌(షాద్‌నగర్‌) తదితరులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. వీరితోపాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర ముఖ్యనాయకులు కూడా వెళ్తారు. మొదట కర్వెన ప్రాజెక్టును సందర్శిస్తారు. తర్వాత ఉదండాపూర్‌, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుల వద్దకు వెళ్తారు.

భారాస ప్రభుత్వ బండారం బయటపెట్టేందుకే: వంశీచంద్‌రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యముంటే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సవాల్‌ చేశారు. గత భారాస ప్రభుత్వ బండారం బయటపెట్టడానికి శుక్రవారం పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్‌ నేతలు వెళ్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన గురువారం బహిరంగ లేఖ రాసి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా 575 టీఎంసీలు కాగా.. 299 టీఎంసీలకే సంతకం చేసి రాష్ట్రానికి కేసీఆర్‌ అన్యాయం చేశారు. కృష్ణా బేసిన్‌పై గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నమూ చేయలేదు. ఏపీ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతున్నా అడ్డుకోలేకపోయారు. పదేళ్లలో పాలమూరుకు చుక్క నీళ్లు ఇవ్వలేదు’’ అని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని