భాజపాలోకి నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు

భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు గురువారం కమలదళంలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డిల సమక్షంలో రాములు కాషాయ కండువా కప్పుకొన్నారు.

Published : 01 Mar 2024 05:36 IST

కాషాయ కండువా కప్పుకొన్న వనపర్తి జడ్పీ ఛైర్మన్‌, మరికొందరు నేతలు

ఈనాడు, దిల్లీ: భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు గురువారం కమలదళంలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డిల సమక్షంలో రాములు కాషాయ కండువా కప్పుకొన్నారు. రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌, వనపర్తి జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, సర్పంచుల సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ ‘‘దళిత నాయకుడిగా నాగర్‌కర్నూల్‌ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలకు రాములు సుదీర్ఘకాలం సేవ చేశారు. భాజపాలో ఆయన చేరిక.. తెలంగాణలో మోదీకి ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది. భారాస అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి.. మార్పు కోరుకోవడం వల్ల కాంగ్రెస్‌ లాభపడింది. వారి మూణ్నాళ్ల పాలనను కూడా ప్రజలు చూశారు. భాజపాలో చేరడానికి చాలామంది ముందుకొస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లలోనూ పార్టీ విజయం ఖాయం’’ అని పేర్కొన్నారు. రాములు చేరిక భాజపాకు బలం చేకూరుస్తుందని డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. రాములు మాట్లాడుతూ.. ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చారని, దానివల్ల అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తనవంతు కర్తవ్యంగా మద్దతివ్వడానికి భాజపాలో చేరుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని