హిమాచల్‌లో ఊపిరి పీల్చుకొన్న కాంగ్రెస్‌

హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోయే దశకు వెళ్లి.. జాగరూకతతో ప్రస్తుతానికి క్షేమంగా బయపడింది.

Published : 01 Mar 2024 05:36 IST

కలకలం రేపిన రాజ్యసభ ఎన్నికల క్రాస్‌ ఓటింగ్‌
ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు
భాజపా ‘అవిశ్వాస’ ప్రయత్నాలకు ప్రభుత్వం చెక్‌

శిమ్లా, దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోయే దశకు వెళ్లి.. జాగరూకతతో ప్రస్తుతానికి క్షేమంగా బయపడింది. రాష్ట్రంలోని ఒక స్థానానికి మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగుకు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌సింగ్‌ అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్‌ గుర్తుపై గెలుపొందిన వీరు సభకు హాజరై ఆర్థికబిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఓటింగుకు దూరంగా ఉండిపోయారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లఘించినందుకు ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వు చేసిన స్పీకర్‌.. గురువారం శిమ్లాలో  వేటు విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు 14వ హిమాచల్‌ విధానసభలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషను జారీ చేశారు. స్పీకర్‌ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజిందర్‌ రాణా తెలిపారు. మరోవైపు.. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగు నేపథ్యంలో కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కలిసిన భాజపా నేతలు అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందకుండా చూసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభలో నినాదాలు చేశారన్న కారణంగా 15 మంది భాజపా ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండు చేశారు. అనంతరం వాయిస్‌ ఓటింగు ద్వారా ఆర్థిక బిల్లును ఆమోదించడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32కు మారింది. తాజా పరిణామాల అనంతరం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నంద]ున ప్రస్తుతానికి సర్కారుకు ఢోకా లేదు. మొత్తం 68 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ 40, భాజపా 25 సీట్లను గెలుచుకోగా.. ముగ్గురు స్వతంత్రులు ఎన్నికయ్యారు.

అభిషేక్‌ సింఘ్వి ఓటమి బాధ్యతను స్వీకరించిన సీఎం

హిమాచల్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వి ఓటమి బాధ్యతను ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు స్వీకరించినట్లు పార్టీ కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్‌ తెలిపారు. ఇతర పరిశీలకులు భూపిందర్‌ సింగ్‌ హుడా, భూపేశ్‌ బఘేల్‌లతో కలిసి గురువారం శిమ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అందరితో ఏకాంత చర్చలు జరిపామని, విభేదాలు సమసిపోయినట్లు వెల్లడించారు. పార్టీ అంతర్గత విషయాల పరిష్కారానికి ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ముఖ్యమంత్రిని మార్చాలని రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఓ వర్గం గళమెత్తుతున్న నేపథ్యంలో సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

‘ఆపరేషన్‌ కమలం’ విఫలమయ్యేలా చక్రం తిప్పిన ప్రియాంక

హిమాచల్‌లో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన భాజపా తన ప్రయత్నంలో విఫలమైందని, రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ కమలం’ విఫలమై కాంగ్రెస్‌  ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకాగాంధీ కీలకపాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖులతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు, పరిశీలకులతో ఆమె ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ మరో రాష్ట్రం తమ నుంచి చేజారకుండా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. హిమాచల్‌లో భాజపా ‘చాణక్యుడి’ ధన, అధికార బలాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం అడ్డుకొందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా పోస్ట్‌ చేశారు.

సంక్షోభానికి కాంగ్రెసే కారణం : భాజపా

రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రతిపక్ష భాజపా నేత జైరాం ఠాకుర్‌ విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ బిల్లు ఆమోదం కోసమే 15 మంది భాజపా ఎమ్మెల్యేలను సస్పెండు చేసిందన్నారు. రాజ్యసభ ఎన్నికలో అనూహ్య ఓటమితో కాంగ్రెస్‌ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హిమాచల్‌ భాజపా చీఫ్‌ రాజీవ్‌ బిందల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని