ఈ ఎన్నికలు నరేంద్రమోదీపై యుద్ధమే!

రాబోయే పార్లమెంటు ఎన్నికలను నరేంద్రమోదీతో యుద్ధంలా భావించాలని, ఇందులో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 01 Mar 2024 03:26 IST

డబ్బెలా సంపాదించాలో తెలుసుకునేందుకే కేసీఆర్‌ను పినరయి విజయన్‌ కలిశారు
కేరళ సమరాగ్ని ప్రజాందోళన యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే పార్లమెంటు ఎన్నికలను నరేంద్రమోదీతో యుద్ధంలా భావించాలని, ఇందులో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న 17 సీట్లూ గెలుస్తామని, కేరళలోనూ 20 సీట్లు గెలిపించి దేశంలో ఇండియా కూటమికి అధికారం కట్టబెట్టాలని కోరారు. కేరళ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సమరాగ్ని ప్రజాందోళన యాత్ర సందర్భంగా తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘కేరళలోని కమ్యూనిస్టు సర్కారు.. తెలంగాణను పాలించిన భారాస మాదిరి అవినీతి ప్రభుత్వం. ఇక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నీతిమంతమైన పాలన అందిస్తుంటే.. కేసీఆర్‌ను ఎందుకు కలిశారు? అవినీతితో డబ్బు ఎలా సంపాదించాలి.. ఇతర పార్టీల నాయకులను ఎలా వేధించాలో నేర్చుకునేందుకే ఆయన కేసీఆర్‌ వద్దకు వెళ్లారు. వారిద్దరూ అత్యంత అవినీతిపరులు’ అని రేవంత్‌ ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి కేరళ చాలా ముఖ్యమైనది. భాజపాకు ప్రవేశం లేని రాష్ట్రం ఇదొక్కటే. నరేంద్రమోదీని, భాజపాను రాష్ట్రంలోకి రానీయకుండా ఇక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తలు గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు. గత పదేళ్లుగా ఈ రాష్ట్ర ఎంపీలు మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేరళ ఎంపీ రాహుల్‌గాంధీ దేశంలో ప్రజల మధ్య ప్రేమను పెంచేందుకు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కి.మీ. పాదయాత్ర చేశారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు దారుణం

కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తూ చంపుతున్నారు. ఇది దారుణం. కేంద్రంలోని భాజపా ఏలుబడిలో మణిపుర్‌లో వందలాది మందిని హత్య చేశారు. ఇలాంటి వారికి పరిపాలించే అర్హత లేదు. 2014, 2019 ఎన్నికల్లో భాజపా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం అమరులయ్యారు. కానీ భాజపా నుంచి దేశం కోసం ఒక్కరైనా ప్రాణత్యాగం చేశారా? ఆ పార్టీ ప్రారంభమైంది 1981లో. దానికి స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేదు. ఈ దేశంలో చేసిన అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ పార్టీదే’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని