నేడు తిరుపతిలో కాంగ్రెస్‌ న్యాయసాధన సభ

ప్రత్యేక హోదా డిక్లరేషన్‌ కోసం న్యాయసాధన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనుంది.

Updated : 01 Mar 2024 06:46 IST

హాజరుకానున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఈనాడు, తిరుపతి: ప్రత్యేక హోదా డిక్లరేషన్‌ కోసం న్యాయసాధన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనుంది. ఎస్వీ విశ్వవిద్యాలయం ఎదురుగానున్న ఎస్వీ తారకరామ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. 2014 ఎన్నికలకు ముందు తిరుపతిలో ఇదే స్టేడియంలో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించనున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రస్తావించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు. కేంద్ర మాజీమంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, సీనియర్‌ నేతలు కనుమూరి బాపిరాజు తదితరులు హాజరుకానున్నారు.

ఆశావహులతో ముగిసిన షర్మిల ముఖాముఖి

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన ఆశావహులతో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల రెండు రోజుల ముఖాముఖీ గురువారం ముగిసింది. బుధవారం ఆరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన 290 మందితో చర్చించారు. శ్రీకాకుళం, అరకు, విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 67 అసెంబ్లీ సెగెంట్లలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన ఆశావహులతో గురువారం చర్చించారు. పార్టీ టికెట్లు ఎవరికి ఇవ్వాలన్న విషయమై సీనియర్లతోనూ ఆమె చర్చించాక నివేదికను రూపొందించి ఏఐసీసీ ఆమోదానికి పంపుతారు. ఆ తరువాతే అభ్యర్థులను ప్రకటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని