ఎమ్మెల్యే ఆర్థర్‌, సిద్ధార్థరెడ్డి వర్గీయుల బాహాబాహీ

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆర్థర్‌, శాప్‌ ఛైర్మన్‌ సిద్ధార్థరెడ్డి వర్గీయులు గురువారం బాహాబాహీకి దిగారు.

Published : 01 Mar 2024 04:55 IST

విలేకరి చొక్కా పట్టుకుని ఫోన్‌ లాక్కున్న వైనం

ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆర్థర్‌, శాప్‌ ఛైర్మన్‌ సిద్ధార్థరెడ్డి వర్గీయులు గురువారం బాహాబాహీకి దిగారు. ఆలయంలో గురువారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ముందుగా ఎమ్మెల్యే ఆర్థర్‌, ఆయన వర్గీయులు హాజరయ్యారు. వారు పూజలు చేసి వెనుదిరుగుతుండగా శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఆయన వర్గీయులు వచ్చారు. అప్పుడే, ‘ఆర్థర్‌ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ ఓ వ్యక్తి నినదించారు. ఈ క్రమంలో రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి పిడిగుద్దులు కురిపించారు. ఎమ్మెల్యే వర్గీయుడు, వైకాపా ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రమణపై తీవ్రంగా దాడిచేశారు. ఇరువర్గీయుల మధ్య విభేదాలున్నందున ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రమణ ఫిర్యాదు మేరకు సిద్ధార్థరెడ్డి వర్గీయులపై నందికొట్కూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.

ఫోన్‌ లాక్కుని.. దురుసుగా ప్రవర్తించి

దాడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న ‘న్యూస్‌టుడే’ విలేకరి లక్ష్మీనారాయణపై సిద్ధార్థరెడ్డి వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. లక్ష్మాపురం సర్పంచి భర్త వెంకటేశులు విలేకరి చొక్కా పట్టుకుని, చేతిలోని ఫోన్‌ లాక్కుని ఫొటోలు, వీడియోలు తొలగించారు. అనంతరం తిరిగి ఇచ్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని