వైకాపాలో చేరిన ఇంతియాజ్‌

ఉద్యోగానికి బుధవారం స్వచ్ఛంద విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ గురువారం వైకాపాలో చేరారు.

Published : 01 Mar 2024 04:58 IST

ఈనాడు, అమరావతి: ఉద్యోగానికి బుధవారం స్వచ్ఛంద విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ గురువారం వైకాపాలో చేరారు. ఆ పార్టీ కర్నూలు నేతలతో పాటు  గురువారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ఇంతియాజ్‌ను నియమిస్తున్నట్లు చెప్పారు. వెంటవచ్చిన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఇంతియాజ్‌ అభ్యర్థిత్వాన్ని హఫీజ్‌ఖాన్‌, మోహన్‌రెడ్డి సమర్థించారని రామసుబ్బారెడ్డి తెలిపారు. ఇంతియాజ్‌ మాట్లాడుతూ ‘సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడినై వైకాపాలో చేరాను. నన్ను కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆదేశించారు’ అని చెప్పారు. ఎమ్మెల్యే హఫీజ్‌ మాట్లాడుతూ ‘ఈసారి నేను ఎక్కడా పోటీ చేయడం లేదు. నా కార్యకర్తలు కొందరు భావోద్వేగానికి గురైనా, అందరూ సర్దుకుంటారు. నన్ను పార్టీపరంగా వినియోగించుకుంటామని సీఎం చెప్పారు. నంద్యాల లోక్‌సభ సీటును ముస్లింలకు ఇవ్వడంపై చర్చ లేదు’ అని తెలిపారు.

వీడ్కోలు వేళ కార్యాలయంలో వైకాపా భజన

ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నామని, ఉద్యోగ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న విచక్షణను వారు విస్మరించారు. వైకాపా కండువా వేసుకోవడం ఒక్కటే తక్కువన్నట్లుగా ప్రభుత్వ కార్యాలయంలో అధికార పార్టీ భజన చేశారు. సెర్ప్‌ సీఈవోగా ఉంటూ ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన ఏఎండీ ఇంతియాజ్‌.. వైకాపాలో చేరడానికి ముందు బుధవారం సెర్ప్‌ కార్యాలయంలో ఆయనకు వీడ్కోలు తరహా సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొందరు ఉద్యోగులు కర్నూలు ఎమ్మెల్యేగా ఇంతియాజ్‌ను గెలిపించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే, తామంతా ఈసీ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందన్న బెరుకు కూడా లేకుండా ఈ ప్రకటనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు