ప్రజలపై అవినీతి భారం!

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగా విద్యుత్తు, చెత్త సేకరణ, ఇతర విషయాల్లో ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు.

Published : 01 Mar 2024 05:00 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగా విద్యుత్తు, చెత్త సేకరణ, ఇతర విషయాల్లో ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ఘోరంగా దెబ్బతిన్న రోడ్లపై నడిచే ఆటోలు తరచూ మరమ్మతుకు గురవుతున్నందున వాటి డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల ఆర్థిక సాయం ఎందుకు ఉపయోగపడడంలేదన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధికారి ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టు, జిల్లా మీడియా అధికార ప్రతినిధులతో కార్యశాల జరిగింది. దీనిని ఉద్దేశించి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఓటు బ్యాంక్‌ రాజకీయాలను నడుపుతోందన్నారు. వివిధ రకాల సంక్షేమ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నా వాటి గురించి చెప్పకుండా తనవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన గృహాలను ఇంతవరకు లబ్ధిదారులకు అందజేయలేదన్నారు. నెల్లూరులోని గృహాలను పరిశీలించినప్పుడు నాసిరకం నిర్మాణాలతో కనిపించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను భాజపా మాత్రమే పోషిస్తుందని తెలిపారు. ఎన్నికలు మరో 50 రోజుల్లో జరగబోతున్నాయని, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ముఖ్య అధికారి ప్రతినిధి లంకా దినకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని