ప్రత్తిపాటి శరత్‌ అరెస్టుపై తెదేపా ఆందోళన

తెదేపా నాయకుడు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అక్రమ అరెస్టుపై తెదేపా నాయకులు భగ్గుమన్నారు.

Published : 01 Mar 2024 05:03 IST

సీపీ కార్యాలయం ముట్టడి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: తెదేపా నాయకుడు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అక్రమ అరెస్టుపై తెదేపా నాయకులు భగ్గుమన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా తీసుకువెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ గురువారం రాత్రి విజయవాడలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తెదేపా నేతలు గద్దె రామ్మోహన్‌, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, న్యాయవాది లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు అక్కడకు చేరడంతో పోలీసులు గేటు వద్ద మోహరించారు. సీపీని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాయకులు ఆందోళనకు దిగారు.

నలుగురికే అనుమతించడంతో గద్దె రామ్మోహన్‌, పుల్లారావు, పట్టాభి, న్యాయవాది లక్ష్మీనారాయణ తదితరులు లోపలికి వెళ్లి డీసీపీ కంచె శ్రీనివాసరావుతో మాట్లాడారు. తమ కుమారుడిని ఎవరు, ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేదని.. నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ప్రత్తిపాటి వివరించారు. మాచవరం పోలీసులు అరెస్టు చేశారని డీసీపీ తెలిపారు. గంటలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సీఐడీతో పాటు తాజాగా కొత్తగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ రంగంలోకి దిగి ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. జీఎస్టీ యాక్ట్‌ కింద ఎవరిపై దర్యాప్తు చేయాలన్నా ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ శరత్‌కు అలా ఇవ్వలేదని తెలిపారు. ఆయన 2017లో అదనపు డైరెక్టర్‌గా రెండు నెలలు మాత్రమే పనిచేశారని తెలిపారు. ఎక్కడా ఆరోపణలు లేవన్నారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ ఒత్తిడి వల్లే ఈ తప్పుడు కేసు నమోదు చేశారని విమర్శించారు. శరత్‌ ఆచూకీ కోసం ఉదయం నుంచి తిరిగి తిరిగి చివరకు కమిషనర్‌ కార్యాలయానికి వచ్చామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని