కక్షతోనే అక్రమ కేసులు

ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన సీఎం జగన్‌ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు.

Updated : 01 Mar 2024 06:39 IST

ఏ కంపెనీలోనూ లేకపోయినా జీఎస్టీ కేసేంటి?
నా కుమారుడికి ఏం జరిగినా జగన్‌దే బాధ్యత
మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ: ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన సీఎం జగన్‌ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జీఎస్టీ ఎగవేత అభియోగంపై పోలీసులు తన కుమారుడు శరత్‌బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్‌ తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా కానీ కనీసం షేర్‌హోల్డర్‌గా కానీ లేని తన కుమారుడిపై కక్షతో జీస్టీటీ ఎగవేత కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో తనకు పోటీగా నిలవడానికి అభ్యర్థులు దొరక్క వెతుక్కుంటున్న వైకాపా ఇంతకంటే ఏమీ చేయలేదని చురకలు వేశారు. తన కుమారుడికి కనీసం నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. తెదేపా తరఫున తనకు చిలకలూరిపేట నుంచి సీటు ఖరారు చేసిన రోజే ఏపీఎస్‌డీఆర్‌ఐ కేసు నమోదు చేసిందని తెలిపారు.

ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ఇది సీఎం జగన్‌ పన్నిన పన్నాగమని ధ్వజమెత్తారు. నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారో.. లేక పోలీసుల పేరుతో వైకాపా రౌడీలు కిడ్నాప్‌ చేశారో తెలీడంలేదు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పడంలేదు. పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’ అని పుల్లారావు ఆరోపించారు. ‘నా కుమారుడికి ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యత’ అని అన్నారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. ‘పుల్లారావును రాజకీయంగా ఎదుర్కోలేక.. ఆయన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసి కేవలం ప్రతిపక్ష నేతలను వేధించేందుకే ఉపయోగిస్తున్నారు. అలెక్సా కార్పొరేషన్‌ కంపెనీతో శరత్‌కు సంబంధం లేదు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆయనను ఎందుకు అరెస్టు చేశారు? ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది’ అని పట్టాభి ఆరోపించారు.


శరత్‌ అరెస్టు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద చర్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకొని.. అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.  ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద చర్య. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కక్ష సాధింపులు తీవ్రమయ్యాయి. వైకాపా ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యుల్లా పనిచేసే అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదు. తక్షణం శరత్‌ను విడుదల చేయాలి’.

 చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత 


రాజకీయంగా ఎదుర్కోలేకే అరెస్టు

రాజకీయంగా ప్రత్తిపాటి పుల్లారావును ఎదుర్కొనే ధైర్యంలేకే ఆయన కుమారుడు శరత్‌ను అరెస్టు చేశారు. శరత్‌ ఆచూకీ కూడా చెప్పకుండా వేధించడం సైకో చర్యలకు నిదర్శనం.

అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 


కుతంత్రాల్ని తిప్పికొడతాం

శరత్‌ను తీసుకెళ్లింది పోలీసులా.. జగన్‌ సైకో ముఠానా..? ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? ఆయనకు ఏమైనా హాని తలపెట్టారేమోనని అనుమానం కలుగుతోంది. సైకో జగన్‌ కుతంత్రాల్ని తిప్పికొడతాం. 

నారా లోకేశ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని