బాబును కలిశాకే రాజకీయ నిర్ణయం: బొల్లినేని

‘తెలుగుదేశం పార్టీకి, మాజీ సీఎం చంద్రబాబుకు 14 ఏళ్లుగా సేవ చేశా.. అయినా నాకు జరిగిన అవమానం జీవితంలో మర్చిపోలేను.. కనీసం ఒక్కమాట చెప్పకుండా ఎమ్మెల్యే టికెట్‌ను ఇతరులకు కేటాయించారు.

Published : 01 Mar 2024 05:06 IST

కలిగిరి, న్యూస్‌టుడే: ‘తెలుగుదేశం పార్టీకి, మాజీ సీఎం చంద్రబాబుకు 14 ఏళ్లుగా సేవ చేశా.. అయినా నాకు జరిగిన అవమానం జీవితంలో మర్చిపోలేను.. కనీసం ఒక్కమాట చెప్పకుండా ఎమ్మెల్యే టికెట్‌ను ఇతరులకు కేటాయించారు. ఈ ప్రక్రియలో పక్క నియోజకవర్గంలో వాళ్లకు ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు. చంద్రబాబు టికెట్‌ విషయంలో పునరాలోచించకుంటే ఇక్కడ తెదేపా సర్వనాశనం అవుతుంది. ఆయనపై ఎలాంటి కోపం లేదు.. ఇది నా ఆవేదన మాత్రమే. త్వరలో చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరిస్తా. ఆ తరువాత నా రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా’ అంటూ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు కార్యకర్తల ఎదుట వాపోయారు. ఉదయగిరి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, అభిమానులతో గురువారం ఆయన కలిగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 8 మండలాల పార్టీ కన్వీనర్లు, అభిమానులు బొల్లినేనికి మద్దతు ప్రకటించారు. గతంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తప్పు చేస్తున్నారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు అప్పట్లో చంద్రబాబుకు మద్దతు పలికారని వారంతా గుర్తుచేశారు. ఇప్పుడు పార్టీ అధిష్ఠానం, చంద్రబాబు తప్పు చేసినందునే తామంతా బొల్లినేనికి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయంపై పునఃపరిశీలించాలని డిమాండు చేశారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉన్నామని, వెంటనే చంద్రబాబును కలిసే అవకాశం ఇప్పించాలని కోరారు. పలువురు బొల్లినేని కోసం పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని