జేపీ సంస్థకు జగన్‌ ప్రభుత్వం రూ.1,250 కోట్ల నజరానా

వైకాపా ప్రభుత్వం బూటకపు టెండర్ల ద్వారా జేపీ సంస్థకు ఇసుక వ్యాపారం కట్టబెట్టి, దానికి రూ.1,250 కోట్ల భారీ డిస్కౌంట్‌ను ఇచ్చిందని, సీఎం జగన్‌రెడ్డి దోపిడీకి సహకరించేందుకే ఈ అవకాశం కల్పించిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

Published : 01 Mar 2024 05:07 IST

ఇసుక టెండర్‌ బేస్‌ ప్రైస్‌ ఉండాల్సింది రూ.2,764 కోట్లు
రూ.1,528 కోట్లకే కట్టబెట్టారు
తెదేపా అధికారప్రతినిధి పట్టాభిరామ్‌

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం బూటకపు టెండర్ల ద్వారా జేపీ సంస్థకు ఇసుక వ్యాపారం కట్టబెట్టి, దానికి రూ.1,250 కోట్ల భారీ డిస్కౌంట్‌ను ఇచ్చిందని, సీఎం జగన్‌రెడ్డి దోపిడీకి సహకరించేందుకే ఈ అవకాశం కల్పించిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. ఎటువంటి అనుభవం  లేని సంస్థకు రూ.1,528 కోట్ల నామమాత్రపు విలువతో టెండరు ఎలా కట్టబెట్టారని నిలదీశారు. జీఎస్టీ అధికారులకు గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి రాసిన లేఖలో వీరి బాగోతం బట్టబయలైందన్నారు. ప్రభుత్వ ఖజానా కోల్పోయిన రూ.1,250 కోట్లు, జేపీ సంస్థ ప్రభుత్వానికి బకాయిపడిన రూ.500 కోట్లు.. సీఎం జగన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డిలలో ఎవరు కడతారని ఆయన నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పట్టాభిరామ్‌ గురువారం విలేకర్లతో మాట్లాడారు. ‘2019 సెప్టెంబరు నుంచి 2021 మే 15 వరకు ఏపీఎండీసీ 20 నెలలపాటు రూ.2,610 కోట్ల విలువైన ఇసుక విక్రయించింది. ఇందులో డోర్‌డెలివరీ వ్యయం రూ.710.09 కోట్లు, కరోనా లాక్‌డౌన్‌తో నాలుగు నెలలపాటు సాగని ఇసుక అమ్మకాల లెక్క తీసేస్తే 16 నెలల్లో నెలకు రూ.115.18 కోట్ల విలువైన ఇసుక విక్రయించారు. తర్వాత రెండేళ్ల కాలానికి ఇసుక టెండర్లు పిలిచినప్పుడు సగటున నెలకు రూ.115.18 కోట్లను పరిగణనలోకి తీసుకొని, రూ.2,764 కోట్లు టెండర్‌ బేస్‌ప్రైస్‌గా పేర్కొనాలి. అంతకంటే ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన సంస్థకు టెండరు ఇవ్వాలి. కానీ రూ.1,528 కోట్లకే జేపీ సంస్థకు టెండరు అప్పగించి, ఇసుక వ్యాపారం ఆరంభానికి ముందే రూ.1,250 కోట్ల భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. ఆ రూ.1,528 కోట్లను కూడా ప్రీమియం ఎమౌంట్‌గా ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరం’ అని పట్టాభిరామ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని