మురికివాడల్లా జగనన్న కాలనీలు

బటన్లు నొక్కి రూ.2.50 లక్షల కోట్లు పేదలకు పంచామని ఊదరగొడుతున్న సీఎం జగన్‌.. రాష్ట్రంలో కనీసం 250 కుటుంబాలనైనా పేదరికం నుంచి గట్టెక్కించారా అని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎల్‌సీపీ) అధ్యక్షుడు జి.విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 01 Mar 2024 05:29 IST

లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జి.విజయ్‌కుమార్‌ విమర్శ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బటన్లు నొక్కి రూ.2.50 లక్షల కోట్లు పేదలకు పంచామని ఊదరగొడుతున్న సీఎం జగన్‌.. రాష్ట్రంలో కనీసం 250 కుటుంబాలనైనా పేదరికం నుంచి గట్టెక్కించారా అని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎల్‌సీపీ) అధ్యక్షుడు జి.విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. పేదలకూ..పెత్తందారులకూ మధ్య యుద్ధమని చెబుతూనే అదే పెత్తందారులకు రాష్ట్ర ఖజానా దోచిపెడుతున్నారని మండిపడ్డారు. పేదవాళ్లకు ఇళ్లు ఇస్తున్నాం.. ఊళ్లు కట్టిస్తున్నామంటున్నారు..సెంటు స్థలంలో కట్టే ఇంట్లో కనీసం గాలైనా వీస్తుందా అని ప్రశ్నించారు. జగనన్న కాలనీలను ముంబయిలోని ధారావి మురికివాడను తలపించేలా తయారు చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఎల్‌సీపీ మూడో ప్రత్యామ్నాయంగా అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా రాష్ట్రంలో 142 రోజుల పాటు 1,200 గ్రామాల్లో, 2,729 కి.మీ. పాదయాత్ర చేశాను. ఎవరిని కదిలించినా.. దుర్భర జీవితాలే, కన్నీళ్లే. నవరత్నాల పేరిట ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. వారి జీవితాలు అలాగే ఎందుకుంటాయి’ అని ప్రశ్నించారు. మాతో కలిసి వచ్చే పార్టీలతో జతకట్టి మూడో ఫ్రంట్‌గా రానున్న ఎన్నికల్లో పోటీచేస్తాం. ఇప్పటికే పూర్వ జేడీ లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఉమ్మడి ప్రకటన చేస్తాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నా. ప్రత్యేక హోదా లాంటి అంశాలపై పోరాడతా’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని