‘జెండా’ సభతో వైకాపా నేతల్లో వణుకు

పొత్తులో భాగంగా తెదేపా-జనసేన పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయో వైకాపా వాళ్లకెందుకని తెదేపా నేతలు ప్రశ్నించారు.

Updated : 01 Mar 2024 06:37 IST

విమర్శల్ని తిప్పికొట్టిన తెదేపా నేతలు 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పొత్తులో భాగంగా తెదేపా-జనసేన పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయో వైకాపా వాళ్లకెందుకని తెదేపా నేతలు ప్రశ్నించారు. జనసేనకు కేటాయించిన స్థానాలతో మీకొచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభ విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో వణుకు మొదలైందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఆ పార్టీ అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యరావు, నాగుల్‌ మీరా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరి వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. దుర్మార్గపు ముఖ్యమంత్రి, దోపిడీ ప్రభుత్వం బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కూటమిగా ఏర్పడినట్లు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు చెప్పారని గుర్తుచేశారు. జెండా సభపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీలోని బీసీ, ఎస్సీ ప్రజాప్రతినిధులు.. విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరు తొలగించి మీ పేరు ఎందుకు పెట్టుకున్నారని, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఏటా జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ, సీపీఎస్‌ రద్దు తదితర హామీల్ని ఎందుకు గాలికొదిలేశారని సీఎం జగన్‌ను నిలదీయాలని డిమాండ్‌ చేశారు. ‘హూ కిల్డ్‌ బాబాయ్‌’ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక మాజీ మంత్రి పేర్ని నాని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బ్రహ్మంచౌదరి విమర్శించారు. తన నియోజకవర్గంలో జరిగిన యువత, రైతుల ఆత్మహత్యలు మంత్రి రోజాకు కనిపించడం లేదని మండిపడ్డారు.

అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు: లోకేశ్‌

‘జెండా’ సభ అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సభ కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రగతి ఎజెండా.. తెలుగుదేశం-జనసేన ‘జెండా’ అంటూ సభపై రూపొందించిన వీడియోను గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని