అన్ని వర్గాల సంక్షేమమే మోదీ ధ్యేయం

మైనారిటీలు సహా దేశంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు.

Published : 01 Mar 2024 05:32 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మైనారిటీలు సహా దేశంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. మతం పేరుతో విభజించి, ఓట్లు దండుకునే సిద్ధాంతం కాంగ్రెస్‌ పార్టీదేనని ఆమె మండిపడ్డారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మైనారిటీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. భాజపాది జాతీయ వాదమన్నారు. ముమ్మారు తలాక్‌ రద్దుతో పాటు మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మోదీ సర్కారు ముస్లింలకు ఇప్పటి వరకు 108 ‘పద్మ’ అవార్డులు ప్రకటించిందని, అబ్దుల్‌ కలాం, బిస్మిల్లాఖాన్‌ వంటి వారికి భారతరత్న పురస్కారాలిచ్చి గౌరవించిన ఘనత ప్రధాని మోదీదేనని ఆ పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ అన్నారు.

నేడు, రేపు భాజపా ఆందోళనలు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘సందేశ్‌ఖాలీలో కొన్ని రోజులుగా మహిళలపై వరుస దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి ఘాతుకాలకు గురైన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేలా ప్రతి జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేయాలి’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు